Asaduddin Owaisi Respond Stone Pelting on His House : ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే సామాన్యుడి సంగతేంటి? : అసదుద్దీన్
Asaduddin Owaisi Respond Stone Pelting on His House : హరియాణాలోని నూహ్‌లోని ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు.. మరోవైపు తన ఇంటిపై రాళ్ల దాడులు జరుగుతున్నాయని.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దేశానికి ఇలాంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. దిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని చెప్పారు. కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు.
వీటి గురించి తనకు భయం లేదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కానీ ఎంపీ నివాసంపైనే ఇలా జరిగితే సామాన్యుడి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటన బీజేపీ నాయకుడి ఇంటిపై జరిగితే పెద్ద గొడవ అయ్యేదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముస్లింల ఇళ్లపై ఓవైపు బుల్డోజర్లు.. మరోవైపు రాళ్లదాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి ఘటనలో కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయని.. కానీ అక్కడ ఎలాంటి రాళ్లు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.