Couple Protest: 'భూమి కోసం' ట్యాంక్ ఎక్కారు.. అనుకోని అతిథుల ఎంట్రీతో..
Couple Protest in Mancherial: మంచిర్యాల జిల్లాలో తమ భూమి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ.. దంపతులు మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కారు. ఆందోళన కోసం ట్యాంక్ ఎక్కితే వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన డోలే సుకుమార్, సుష్మ కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి స్థానికంగా 5 ఎకరాల భూమి ఉంది. స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు ఆ భూమిని కబ్జా చేస్తున్నారని.. తన సమస్యను ఆర్డీవో, తహసీల్దార్, పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ దంపతులు తమ కుమారుడితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశారు.
ఈ క్రమంలో తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కుమారుడు కిందకు దిగిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని దంపతులిద్దరిని గోనె సంచి సాయంతో కిందికి దించారు. సుకుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. అయితే.. బాధితుడు తన భూమిగా చెబుతున్న స్థలంలో ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నిర్మించి ఉండటం కొసమెరుపు.