35 మంది ఓటర్ల కోసం స్పెషల్ పోలింగ్ బూత్- పాక్ బోర్డర్‌కు కిలోమీటర్ దూరంలోనే
Published : Nov 11, 2023, 5:33 PM IST
35 Voters In Village Rajasthan : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రజలు వారి సొంత ఊర్లలోనే ఓట్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆయా చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఓటు వేసేందుకు ప్రజలకు ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఏర్పాట్లు చేస్తోంది. బాడ్‌మేర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాడ్‌మేర్ కా పార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఈ తరహాలోనిదే.
బాడ్‌మేర్ కా పార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆ పోలింగ్ బూత్ పరిధిలో కేవలం 35 మంది ఓటర్లే ఉంటారు. వీరిలో 18 మంది పురుషులు, 17 మంది మహిళలు. జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరం, పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం మొత్తం జనాభా 70 మందే.
తమ ఊరిలో ఆరేళ్ల క్రితమే ఎన్నికల సంఘం పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినట్లు బాడ్‌మేర్ కా పార్ గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో తాము ఓటు వేసేందుకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే వారిమని కానీ ఇప్పుడు సొంత ఊరిలోనే ఓటు వేస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి కూడా ఇక్కడ జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. బాడ్‌మేర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతసారి కాంగ్రెస్ నుంచి మెవారమ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు గెలుపొందారు. మరోసారి ఇక్కడ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు