తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రక్తపోటు హెచ్చుతగ్గులంటే ఏమిటి? - రక్తపోటు తీవ్రమైతే ఎలా?

ఇటీవలే తీవ్ర రక్తపోటు హెచ్చుతగ్గుల మూలంగా సినీ నటుడు రజనీకాంత్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రక్తపోటు హెచ్చుతగ్గులంటే ఏమిటి? దీంతో వచ్చే ముప్పేమిటో తెలుసుకోండి మరి.

Why blood pressure fluctuations takes place?
రక్తపోటు హెచ్చుతగ్గులంటే ఏమిటి?

By

Published : Dec 29, 2020, 10:29 AM IST

మన రక్తపోటు రోజంతా ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం, ఒత్తిడి, కోపం, రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోవటం వంటివి రక్తపోటు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా ఉదయం పూట రక్తపోటు ఎక్కువగా ఉంటుంది.

చలికాలంలో... సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చినప్పుడు, కాఫీ తాగినప్పుడు తాత్కాలికంగా 30 నిమిషాల వరకు రక్తపోటు పెరుగుతుంది. చాలావరకు ఇలాంటి మామూలు కారణాలతో రక్తపోటు 30 మి.మీ.కన్నా లోపే ఎక్కువవుతుంది. ఉదాహరణకు- పై సంఖ్య 120 నుంచి 150 వరకు చేరుకోవచ్చు. కానీ కొందరికి ఇంతకన్నా ఎక్కువగా పెరగొచ్చు. అదీ ఉన్నట్టుండి. ఇలాంటి పరిస్థితిలో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయాల్సి ఉంటుంది. పై సంఖ్యకు 20, కింది సంఖ్యకు 10 చేర్చుకుంటూ.. 140/90, 160/100, 180/110, 200/120.. ఇలా రక్తపోటు తీవ్రతను, ప్రమాదాన్ని పసిగడతారు. పై సంఖ్య 200కు మించితే రక్తనాళాలు చిట్లే ప్రమాదముంది.

గుండె నొప్పికి దారి తీయొచ్చు...

ముక్కులో రక్తనాళాలు చిట్లితే ముక్కు నుంచి రక్తం వస్తుంది. మెదడులో రక్తనాళాలు చిట్లితే పక్షవాతం తలెత్తుతుంది. ఇక కింది సంఖ్య పెరుగుతూ వస్తున్నకొద్దీ గుండె మీద భారం పెరుగుతూ వస్తుంది. ఇది గుండెనొప్పికి దారితీయొచ్చు. గుండె కండరం బలహీనపడితే గుండె విఫలం కావొచ్చు.

మామూలుగానైతే రక్తపోటు పెరిగినప్పుడు పై, కింది సంఖ్యలు రెండూ ఎక్కువవుతుంటాయి. కొందరికి కింది సంఖ్య పెరగకుండా పై సంఖ్య మాత్రమే పెరుగుతుంటుంది. దీన్నే సిస్టాలిక్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు. ఎవరికైనా తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. కారణమేంటన్నది గుర్తించటం చాలా కీలకం.

రక్తపోటు హెచ్చుతగ్గులు 30 కన్నా ఎక్కువుంటే ప్రమాదకరంగా పరిణమించొచ్చు. హఠాత్తుగా రక్తపోటు తగ్గిపోయి, మూడు నాలుగు గంటల పాటు అలాగే ఉంటే కిడ్నీల మీద ప్రభావం చూపొచ్చు. ఉన్నట్టుండి రక్తపోటు పెరిగితే పక్షవాతం రావొచ్చు. ఎవరికైనా ముక్కులో రక్తనాళాలు చిట్లితే ఒకరకంగా అదృష్టమనే అనుకోవచ్చు. ఎందుకంటే ముక్కు రక్తనాళాలు చిట్లకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి ఉండేవి మరి.

ఇదీ చదవండి:'చర్చల్లో సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతాం'

ABOUT THE AUTHOR

...view details