కరోనా కాలంలో మాస్క్ ధరించడం అనివార్యమైంది. వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరించాలా? వద్దా? అనే సందేహాలు చాల మందిలో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వ్యాయామం చేసే క్రమంలో మాస్కులు ధరించడం మంచిదే అని చెబుతోంది ఓ తాజా అధ్యయనం. ముఖ్యంగా ఈ చిట్కా ఇండోర్ జిమ్‌లలో వ్యాయామం చేసే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, తద్వారా కొవిడ్ విస్తరించే ముప్పు చాలా వరకు తగ్గుతుందని వెల్లడించింది. మరి, మాస్క్ పెట్టుకొని వ్యాయామాలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇంకా ఏయే విషయాలు గుర్తుపెట్టుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
జాగ్రత్త అవసరం
నోటి తుంపరల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ముందునుంచీ నిపుణులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం ఎక్కడున్నా మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని సలహా ఇస్తున్నారు. అయితే వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవచ్చా? లేదా? అన్న సందేహానికి తెరదించుతూ యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ఇటీవలే ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో భాగంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం వెల్లడైంది. ముఖ్యంగా జిమ్‌లో వ్యాయామాలు చేసే వారికి మాస్క్ రక్షణ కవచంలా పని చేస్తుందని కూడా పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకొని, తొలగించి ఎక్సర్‌సైజ్ బైక్‌పై వ్యాయామం చేసిన కొంతమంది వ్యక్తుల శ్వాస వ్యవస్థ, గుండె పనితీరు, ఎక్సర్‌సైజ్ పెర్ఫార్మెన్స్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులు.. వంటి అంశాలను ఆధారంగా చేసుకొని.. రెండు సందర్భాల్లోనూ ఎలాంటి అనారోగ్యాలు తలెత్తలేదని తేల్చారు పరిశోధకులు. ఇది కొంతమంది వ్యక్తులపై చేసిన పరిశోధనే కాబట్టి.. అందరిలోనూ ఒకే రకమైన శారీరక స్పందన ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. అందుకే మాస్క్ ధరించి వ్యాయామం చేసే క్రమంలో పలు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు.
ఎలాంటి మాస్క్ అయితే బెటర్?! వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరిస్తే సరిపోదు.. ఈ క్రమంలో పలు విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది గుడ్డతో చేసిన రీయూజబుల్ మాస్కుల్నే ధరిస్తున్నారు.. అయితే వర్కవుట్ చేసే క్రమంలో మన శరరం నుంచి విడుదలయ్యే చెమట కారణంగా ఇవి తడిసిపోయే అవకాశం ఎక్కువ. ఇలా తేమగా ఉన్న వస్త్రానికి వాతావరణంలోని వైరస్, బ్యాక్టీరియాలు త్వరగా ఆకర్షితమవుతాయి. కాబట్టి కాటన్ మాస్కులకు బదులుగా తడి త్వరగా ఆరిపోయే పాలిస్టర్ తరహా మాస్కులైతే మరీ మంచిదని చెబుతున్నారు నిపుణులు. అది కూడా ఒకటి లేదా రెండు లేయర్లదై ఉండాలంటున్నారు. తద్వారా గాలి బాగా ఆడుతుంది.. శ్వాస తీసుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. ఇక కొంతమంది వాడి పడేసే సర్జికల్ మాస్కులు పెట్టుకుంటుంటారు. అయితే చెమటకు తడిసి ఇవి త్వరగా చిరిగిపోవచ్చు. కాబట్టి పాలిస్టర్ తరహా మాస్కులు ఎంచుకుంటూనే.. ఎల్లప్పుడూ అదనంగా ఒకట్రెండు మాస్కులు వెంట ఉంచుకోవడం వల్ల అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తపడచ్చు. మొదట్లో ఇవి కామనే! కరోనా వచ్చిన తొలినాళ్లలో మాస్కులు పెట్టుకోవడం వల్ల ఊపిరి ఆడట్లేదని, చర్మం కందిపోతోందని, అసౌకర్యంగా అనిపిస్తోందంటూ.. ఇలా చాలామంది చాలా రకాలుగా స్పందించిన విషయం తెలిసిందే! అయితే కొన్నాళ్లు పోయాక అవి మన జీవన విధానంలో భాగమయ్యాయి.. అందరూ వాటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు మాస్కులు లేకుండా బయటికి వెళ్లే వారు చాలా తక్కువమందే! ఇదే సూత్రం వ్యాయామం చేసేటప్పుడు మాస్కులు ధరించే విషయంలోనూ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మాస్క్ ధరించి వర్కవుట్ చేసేటప్పుడు మొదట్లో కొన్ని రోజులు ఊపిరి ఆడనట్లు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అయితే ఇది సర్వసాధారణమేనని.. కొన్నాళ్లు పోయాక ఇలాంటి సమస్యలేవీ ఉండవని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు మాస్క్ పెట్టుకొని వర్కవుట్ చేసినా, తొలగించి చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదంటున్నారు. కాబట్టి ఇండోర్ జిమ్, బృందంతో కలిసి వ్యాయామాలు చేసేటప్పుడు.. నిపుణుల సలహా మేరకు మాస్క్ ధరించి చేయడమే అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. |