ప్రస్తుతం వీధికో బ్యూటీ పార్లర్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని పార్లర్స్‌లో అందించే సేవలు బాగానే ఉన్నా, మరికొన్ని విషయ పరిజ్ఞానం లేని బ్యూటీషియన్లతో, స్టైలిస్టులతో, నాసిరకం సౌందర్య ఉత్పత్తులతో నెట్టుకొచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో పార్లర్‌కి వెళ్లినప్పుడు దానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి.
శుభ్రత ముఖ్యం!
పార్లర్‌కి వెళ్లగానే ముందు మనం గమనించాల్సిన విషయం అక్కడి శుభ్రత.. అక్కడ వాడే వస్తువులు, ఇతర సాధనాలన్నీ నీట్‌గా ఉన్నాయా? లేదా? గమనించండి. ఒకరికి వాడిన వస్తువులను ఇంకొకరికి వాడేముందు సరిగా శుభ్రపరుస్తున్నారా? లేదా పరిశీలిస్తే అక్కడి క్వాలిటీ మనకు అర్థమవుతుంది. శుభ్రపరచడం కూడా ఒక్కో వస్తువును ఒక్కో విధంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వస్తువులను మరిగే నీటిలో ఉంచి స్టెరిలైజ్ చేయాలి. ఆ పద్ధతి ఫాలో అవుతున్నారా? లేదా? కనుక్కోండి. అలాగే అక్కడ ఉపయోగించే టవల్స్, ఫుట్ టబ్స్ వంటివి వాసన రాకుండా ఉండాలి. ఒకవేళ అవి దుర్వాసన వస్తుంటే పార్లర్ వాళ్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదని అర్థం.. అలాంటి పార్లర్‌ని ఎంచుకోకపోవడం మంచిది.
ఉత్పత్తుల నాణ్యతా ముఖ్యమే!
పార్లర్ అనగానే రకరకాల ట్రీట్‌మెంట్లు, ఫేషియల్స్, బ్లీచ్‌లు.. ఇలా వివిధ చికిత్సల నిమిత్తం అనేక సౌందర్య ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అవన్నీ మంచి కంపెనీలవేనా? కాదా? గమనించండి. పేరున్న కంపెనీల ఉత్పత్తులను వాడితే మంచిది. పార్లర్ రేంజ్‌ని బట్టి మరీ ఎక్కువ రేటున్న ఉత్పత్తులు కాకపోయినా.. ఉన్నంతలో నాణ్యమైన ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా? గమనించండి. వూరూ-పేరూ లేని, లేదా మీరెప్పుడూ వినని కంపెనీ పేర్లతో ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే అలాంటి పార్లర్లకు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే నాసిరకం ఉత్పత్తుల వల్ల చర్మానికి దీర్ఘకాలంలో హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మంచి నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులను వాడే పార్లర్స్‌కే వెళ్లడం అన్ని రకాలుగా శ్రేయస్కరం.
స్టైలిస్ట్ నేర్పరేనా?
పార్లర్‌లో బ్యూటీ ట్రీట్‌మెంట్స్ చేసే బ్యూటీషియన్ లేదా స్టైలిస్ట్‌కి అవి చేయడం వచ్చో, రాదో ముందు గమనించండి. ఎందుకంటే ట్రైనింగ్ లేని వ్యక్తులు చేస్తే మీ చర్మం పూర్తిగా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మీరు వెళ్లే పార్లర్‌లో స్టైలిస్ట్‌లంతా శిక్షణ పొంది, అనుభవజ్ఞులై ఉండాలి. లేదంటే పార్లర్ చికిత్సల వల్ల చర్మానికి హాని జరిగే అవకాశం ఉంటుంది.
సలహా తీసుకోండి..
కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల చాలా లాభాలుంటాయి. ముఖ్యంగా మంచి బ్యూటీ పార్లర్, డాక్టర్, మంచి బొతిక్ వంటి వాటిల్లో ఇతరుల సలహాలను ఒకసారి పాటించి చూడచ్చు.. అలాగని వాళ్లకు నచ్చింది మీక్కూడా నచ్చాలని లేదు. అందుకే ఒకసారి వెళ్లి, వ్యక్తిగతంగా పరిశీలించి అక్కడి వాతావరణం మీక్కూడా నచ్చితేనే కంటిన్యూ అవండి.