ఏదైనా నీటి పంపులో దారి సవ్యంగా ఉన్నంతకాలం నీరు సాపీగా ప్రవహిస్తుంది.ఆ పంపులో దారికి ఏదైనా అడ్డుపడినా,లేదా దారి చిన్నదైనా ప్రవాహం ఆగిపోవడమో లేదా ప్రవాహం ఒత్తిడి పెరిగి పంపు పగిలిపోవడమో జరుగుతుంది.అచ్చంగా మన రక్తనాళాలు కూడా ఇంతే.రక్తనాళాల్లో అడ్డంకులేర్పడినా,దారి చిన్నగా మారినా రక్తపోటు పెరుగుతుంది.దాన్నే మనం హైబీపీ అని పిలుస్తుంటాం.సాధారణంగా రక్తం మనకు ప్రాణాధారం.మన దేహంలోని అణువణువుకూ జీవనాధారం.ప్రాణ వాయువును,పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికీ రక్తమే తీసుకెళుతుంది.గుండె కొట్టుకున్న ప్రతిసారీ గుండె నుంచి రక్తం బయటకు వెళుతుంది.అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది.రక్తం ఇలా ప్రవహిస్తున్నపుడు రక్త నాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది.ఈ ఒత్తిడినే మనం రక్తపోటనీ,బ్లడ్ ప్రెజర్ అనీ,బీపీ అని పిలుస్తాం.
120/80...ఆరోగ్యవంతుల్లో సాధారణంగా ఉండే రక్తపోటు ఇది.ఇటీవలి కాలంలో చాలామందిలో రక్తపోటు బాగా పోటెత్తుతోంది.ఇందుకు కారణాలు అస్పష్టమని చెబుతారు డాక్టర్లు.జన్యుపరమైన అంశాలు మొదలుకుని గజిబిజి జీవనశైలి,వ్యక్తిగత అలవాట్లు మొదలైనవన్నీ హైబీపీని తెచ్చిపెట్టేవే.హైబీపీని తగ్గించుకునేందుకు మన సంప్రదాయ వైద్యం బాగా పనిచేస్తుంది.
''హైబీపీకి యోగిక్ వ్యాయామాలు బాగా పనిచేస్తాయి. వీటిల్లో హాట్ ఫుట్ బాత్ బాగా పనిచేస్తుంది. ఇదొక వాటర్ థెరపీ లాంటిది. వేణ్నీళ్లలో కాళ్లు ఉంచి చేసే థెరపీ ఇది. ఈ థెరపీలోనే భాగంగా వ్యక్తికి మధుమేహం లేకపోతే బీట్ రూట్ జ్యూస్ ఇస్తాం. కొంత ఆహారాన్ని కూడా ప్లాన్ చేస్తాం. నిజానికి హైబీపీలో కూడా ప్రధాన పాత్ర ఆహారానిదే. వ్యక్తిని బట్టి ఆహారాన్ని ప్లాన్ చేస్తాం మేము. శరీర తత్వాన్ని విశ్లేషించి ఆహారాన్ని ఇస్తాం. హైబీపీలో ప్రధానంగా వాటర్ థెరపీ మీద దృష్టి పెడతాం. హైబీపీని నియంత్రించడంలో ఇది బాగా పనిచేస్తుంది."
-డాక్టర్ ఎం. అర్చన, సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్