Mandatory Screening Tests For Men: సాధారణంగా మగవారు బయటకు వెళ్లి పనులు చక్కబెడుతుంటారు. కొన్నిసార్లు బయట.. ఆహారం తినాల్సి వస్తుంది. నీరు తాగాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కొత్త సమస్యలు వచ్చి చేరుతాయి. ఇక షిప్టుల్లో పనిచేసేవారికైతే నైట్ షిప్ట్ సిండ్రోమ్ వేధిస్తుంటుంది. వయసు, చేసిన పని బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే.. అవి మన ఆరోగ్యవంతమైన జీవితానికి దిక్సూచి మాదిరిగా ఉంటాయి. ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. ప్రాణాంతకర వ్యాధులు సోకకుండా కాపాడతాయి. అయితే మగవారు ఏ వైద్యపరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం.
"30-60 ఏళ్ల మధ్య మగవారు కచ్చితంగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. మిగతా వయసు వారు కూడా చేయించుకోవచ్చు. మగవారిలో ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అలవాట్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వీటి వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ బారినపడతారు. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకుంటే వీటిని నివారించొచ్చు. ఏడాదికి ఒక్కసారి అయినా వైద్యపరీక్షలు చేసుకోవాలి. జన్యుపరమైన వ్యాధులు ఉంటే తరచూ చేయించుకోవాలి.
50 ఏళ్లు వచ్చాక శరీరంలో మెల్లమెల్లగా మార్పులు వస్తాయి. ఆ సమయంలో కంటి చూపు ఎలా ఉందో చూసుకోవాలి. మెదడు పనితీరును పరీక్షించుకోవాలి. తమ కుటుంబంలో క్యాన్సర్ రోగులు ఉంటే వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు ఆ వయస్సులో గుండెపోటు, మెదడుపోటు వస్తుంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి."-- డా.వుక్కల రాజేశ్, జనరల్ ఫిజీషియన్