Vitamin C Helps Cold : తరచూ జలుబుతో బాధపడేవారిలో కొందరు విటమిన్ సి మాత్రలు వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని భావిస్తుంటారు. విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచే మాట నిజమే. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్ కూడా. అంతమాత్రాన జలుబు వైరస్‌ల పని పడుతుందని అనుకోవటానికి లేదు. ఈ వైరస్‌లను అడ్డుకోవటంలో, జలుబును తగ్గించటంలో దీని ప్రభావం అంతంతేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రోజుకు 200 మి.గ్రా. అంతకన్నా ఎక్కువ మోతాదులో విటమిన్ సి తీసుకోవటం ద్వారా జలుబు బారినపడటం, దీని తీవ్రత, వేధించే కాలం తగ్గుతాయా? అనేది గుర్తించటానికి గతంలో పరిశోధకులు పెద్ద అధ్యయనమే నిర్వహించారు.
అరవై ఏళ్ల వైద్య పరిశోధనను సమీక్షించిన తర్వాత తేల్చిందేంటంటే- జలుబు మొదలయ్యాక విటమిన్ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రత, ఇది వేధించే సమయంలో ఎలాంటి తేడా లేదనే. రోజూ విటమిన్ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతున్నట్టు బయటపడింది. విటమిన్ సి మాత్రలు జలుబును నివారించటం లేదని మరో అధ్యయనంలో తేలింది. కాకపోతే కొందరిలో లక్షణాల తీవ్రత కొద్దిగా తగ్గినట్టు గుర్తించారు. ఎక్కువ దూరాలు పరుగెత్తే క్రీడాకారుల వంటి దేహ దారుఢ్యం గలవారిలో మాత్రం రోజూ విటమన్ సి మాత్రల వేసుకుంటే జలుబు వచ్చే అవకాశం సగం వరకు తగ్గుతుండటం గమనార్హం. ఏతావాతా జలుబు నివారణ, చికిత్సల్లో ఈ మాత్రలు అంతగా ఉపయోగపడటం లేదనే ఇవన్నీ సూచిస్తున్నాయి.