తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

శరీర ప్రకృతిని అనుసరిస్తేనే ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండటానికి ఏం చెయ్యాలి? పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. శరీర ప్రకృతిని అనుసరిస్తే చాలు. ఆరోగ్యం తనకు తానే పరిఢవిల్లుతుంది. ప్రకృతి వైద్యం సారమిదే. కంటికి కనిపించే ప్రకృతికే కాదు, మన శరీర ప్రకృతికీ సూర్యుడే ఆధారం. నిద్ర, మెలకువలను నియంత్రించే మనలోని జీవగడియారం (సర్కాడియన్‌ రిథమ్‌) సూర్య గమనాన్ని బట్టే సాగుతుంది. ఉదయం హుషారు, మధ్యాహ్నం చురుకు, సాయంత్రం బడలిక, రాత్రి నిద్ర అన్నీ దీని మూలంగానే. అందుకే ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలోనే చేయాలి. అప్పుడు జీవితమే ఒక సంక్రాంతి అవుతుంది.

శరీర ప్రకృతిని అనుసరిస్తే.. ఆరోగ్యం...
శరీర ప్రకృతిని అనుసరిస్తే.. ఆరోగ్యం...

By

Published : Jan 12, 2021, 10:08 AM IST

ఆరోగ్యంతో పాటే అనారోగ్యం! ఆరోగ్యం బాగుంటే అనారోగ్యానికి తావే లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శరీరం రకరకాలుగా ప్రతిస్పందిస్తుంటుంది. వీటికి అనుగుణంగా నడచుకుంటే అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవచ్చు. ఒకప్పుడు పెందలాడే లేవటం, చీకటి పడకముందే తినేసి, పడుకోవటం అలవాటు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాల మూలంగా మన జీవనశైలి పూర్తిగా తలకిందులైంది. వేళకు భోజనం చేయటం మానేశాం. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండటం, పొద్దు పోయాక లేవటమూ ఎక్కువైంది. ఇవన్నీ మన శరీర ప్రకృతికి విరుద్ధమైన పనులే. జబ్బులకు బీజం వేస్తున్నవి ఇవే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. సరిదిద్దుకోవటం ఎప్పుడైనా మంచిదే. ఇందుకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి కన్నా మంచి తరుణం ఇంకేముంటుంది? ఇంట్లోని పనికిరాని, పాత వస్తువులతో పాటు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనలు, అలవాట్లను భోగిమంటల్లో కాల్చేసి.. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసుకునేలా సూర్యుడి గమననానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది?

ప్రభాత ప్రశాంతం!

అప్పుడో, మరికాసేపటికో ఉదయించే సూర్యుడు. లేలేత కాంతి. చల్లటి గాలి. శారీరక, మానసిక ఉత్సాహానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? అందువల్ల సూర్యోదయంతోనో, ఇంకాస్త ముందుగానో నిద్ర లేవటం మంచిది.

కాసిన్ని నీళ్లు:

లేవగానే నోరు పుక్కిలించి, ఒక గ్లాసు నీళ్లు.. అదీ గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు తాగాలి. రాత్రంతా జరిగిన జీవక్రియలతో పుట్టుకొచ్చిన వ్యర్థాలన్నీ లోపల పోగై ఉంటాయి. నీళ్లు తాగాక కాలకృత్యాలు తీర్చుకుంటే ఇవి మరింత త్వరగా, పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి. కొన్ని వ్యర్థాలు వాయు రూపంలోనూ ఉంటాయి. నీటిలో ఇవీ కలిసి బయటకు పోతాయి.

ధ్యానం:

విసర్జన సమయంలో పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. దీంతో ఒత్తిడి తొలగిపోయి, హాయి భావన కలుగుతుంది. ఈ సమయంలో మనసు కుదురుగా ఉంటుంది. అందువల్ల కాలకృత్యాలు తీర్చుకున్నాక కాసేపు ధ్యానం చేసుకోవటం మంచిది. దీంతో శరీరం మరమ్మతు చేసుకునే ప్రక్రియ

పుంజుకుంటుంది. ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వారు ధ్యానం చేసుకోవచ్చు. కళ్లు మూసుకొని శ్వాస మీద దృష్టి నిలిపినా చాలు. ధ్యానం ఇష్టం లేనివారు ఆత్మావలోకనమైనా చేసుకోవచ్చు. తమను తాము అర్థం చేసుకోవటానికి, తప్పొప్పులను, బలాలు బలహీనతలను గుర్తించటానికిది ఉపయోగపడుతుంది. వ్యాయామం: ధ్యానం, ఆత్మావలోకనం అనంతరం ఇంటి పనుల వంటివన్నీ చేసుకోవచ్చు. ఒంటికి శారీరక శ్రమ తప్పనిసరి. యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. నడక, సైకిల్‌ తొక్కటం, బ్యాడ్మింటన్‌ ఆడటం వంటివేవైనా మంచివే. రోజూ ఒకే సమయానికి వ్యాయామం చేసేలా చూసుకోవాలి.

స్నానం:

వ్యాయామం తర్వాత స్నానం చేయాలి. స్నానాన్ని ఒకరకంగా మనల్ని మనం ప్రేమించుకునే ప్రక్రియ అనుకోవచ్చు. సబ్బుతోనో, చేతులతోనో, తడిబట్టతోనో దేంతోనైనా కాళ్లను పాదాల నుంచి గజ్జల వైపు, చేతులను వేళ్ల నుంచి భుజాల వైపు గుండ్రంగా, నెమ్మదిగా, మృదువుగా రుద్దుకుంటూ రావాలి. తలను పై నుంచి కిందికి.. కడుపు, వీపు భాగాలను కుడి, ఎడమ పక్కలకు ఎటైనా రుద్దుకోవచ్చు. దీంతో చర్మానికి మర్దన అవుతుంది. రక్త ప్రసరణ ఉత్తేజితమవుతుంది. అంతేకాదు, లింఫ్‌ ద్రవమూ సాఫీగా ముందుకు కదులుతుంది. ఫలితంగా రోగనిరోధకశక్తీ పెంపొందుతుంది. వీలున్నప్పుడు అభ్యంగన స్నానం చేయొచ్చు.

తొలి ఆహారం:

స్నానం చేసిన పావుగంట తర్వాత తొలి ఆహారం తీసుకోవచ్చు. ఇది అల్పాహారమే కావొచ్చు, మామూలు భోజనమే కావొచ్చు. ఏదేమైనా మంచి పోషకాహారమై ఉండాలి. రోజంతా శరీరం శక్తిని వినియోగించుకోవటానికి దారి చూపేది ఇదే. అందువల్ల కాస్త ఎక్కువగానే తినటం మంచిది. ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, ద్రవాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

సాయంత్ర బడలిక

సాయంత్రం అవుతున్నకొద్దీ సూర్యుడి తీవ్రత తగ్గుతూ వస్తుంది. మన శరీరంలోనూ క్రమంగా బడలిక మొదలవుతుంది. నిరంతర జీవక్రియల మూలంగా ఒంట్లో లవణాలు, ఖనిజాల వంటి పోషకాలు తగ్గిపోతాయి. ఫలితంగా నిస్సత్తువ, అలసట ఆవహించేస్తుంటాయి. కాబట్టే సాయంత్రం పూట కారంగా, ఉప్పగా, పుల్లగా ఉండేవి ఏవైనా తింటే బాగుండునని అనిపిస్తుంటుంది. టీ, కాఫీ వంటివి తాగాలని అనిపిస్తుంది. తక్షణ శక్తి అవసరమని శరీరం ఇచ్చే సూచనలే ఇవి. ఇలాంటి సమయంలో బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులతో కూడిన చిరుతిళ్లు తినొచ్చు. అరటి, ఖర్జూరం వంటి పండ్లూ మేలు చేస్తాయి. ఇవి తేలికగా జీర్ణమై, సత్వరం శక్తి అందిస్తాయి. పాలు, మజ్జిగ, రాగి అంబలి, నిమ్మరసం నీళ్ల వంటివీ తాగొచ్చు.

మధ్యాహ్న మార్తాండం!

అల్పాహారం జీర్ణమై, శరీరం గ్రహించుకున్నాక దాహం వేస్తుంది. దీన్ని చాలామంది ఆకలిగా పొరపడి భోజనం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తాగాల్సింది నీళ్లు. నిజంగానే ఆకలి వేసినప్పుడు మధ్యాహ్న భోజనం చేయాలి. రోజూ ఒకే సమయానికి తినాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల సమయంలో భోజనం చేస్తే జీర్ణక్రియ చురుకుగా సాగుతుంది. స్థిమితంగా కూర్చొని, నెమ్మదిగా నములుతూ తినాలి. ఆరోగ్య సాధనలో సరైన ఆహారం కీలకం. తగినన్ని పోషకాలు అందకపోతే కణాలు, కణజాలాలు, కండరాలు, అవయవాలన్నీ చతికిలపడిపోతాయి. మన శరీరంలో జబ్బులను బాగు చేసే యంత్రాంగం ఉంటుంది. ధాన్యాలు, కొవ్వులు, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు.. ఇలా అన్నిరకాల పోషకాలు అందితేనే ఇది సరిగా పనిచేస్తుంది. ఏవి లోపించినా గతి తప్పుతుంది. కాబట్టి అన్నీ సమతూకంలో ఉండేలా చూసుకోవాలి. నెయ్యి విధిగా తీసుకోవటం మంచిది. రెండు చెంచాల నెయ్యి వచ్చేంత వెన్న అయినా తీసుకోవచ్చు. ఇది శక్తినివ్వటంతో పాటు జీర్ణక్రియనూ ఉత్తేజితం చేస్తుంది. అన్నం, చపాతీ వంటి వాటికన్నా (ధాన్యాలు) కూరలు రెండింతలు ఎక్కువగా ఉండాలి. అంటే ఒక కప్పు ధాన్యాలకు ఒక కప్పు కూరగాయలు, ఆకుకూరలు.. ఒక కప్పు పప్పు (మాంసాహారులైతే చికెన్‌, మాంసం) తీసుకోవాలన్నమాట. అలాగే ఒక కప్పు రసం లేదా సాంబారు వంటి ద్రవాలు కచ్చితంగా తీసుకోవాలి. ఇక చివర్లో అప్పుడే తోడుకుంటున్న పెరుగు తీసుకోవాలి. లేదూ తోడుకున్న పెరుగును చిలికినప్పుడు పైకి తేరుకునే వెన్నతో కూడిన నీళ్లు తాగాలి. దీన్ని కనీసం 50 ఎం.ఎల్‌. అయినా తాగాలి. ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి, ఆహారం బాగా జీర్ణం కావటానికి, పోషకాలు ఒంటికి సరిగా అందటానికి తోడ్పడుతుంది. భోజనం చేసేటప్పుడు పొలమారినా, కారంగా అనిపించినా ఒక గుటక నీళ్లు తీసుకోవచ్చు గానీ మరీ ఎక్కువగా తాగకూడదు. భోజనం పూర్తయ్యాక 15-20 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి. దీంతో ఆహారం బాగా జీర్ణమవుతుంది.

నీళ్లు:

మన శరీరం తిండి కన్నా నీటినే ఎక్కువగా కోరుకుంటుంది. దీన్ని నిరంతరం అందిస్తుండాలి. దాహం వేసినప్పుడు తాగాలి. ఆరోగ్యవంతులు రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది ఆయా కాలాలను బట్టి మారుతుంది. చలికాలంలో తక్కువ, ఎండకాలంలో ఎక్కువ నీరు అవసరమవుతుంది. జబ్బులు ఉన్నవారు డాక్టర్ల సూచనల మేరకే తీసుకోవాలి.

రాత్రి విశ్రాంతి

సూర్యాస్తమయంతోనే జీవక్రియల చురుకుదనం తగ్గుతుంది. అందువల్ల రాత్రి (చివరి) భోజనాన్ని సూర్యుడు అస్తమించటానికి ముందే ముగించెయ్యాలి. అదీ మితంగానే తినాలి. తేలికగా జీర్ణమయ్యే, తక్కువ ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇది రోగనిరోధకశక్తి, ప్రాణశక్తి ఉత్తేజితం కావటానికి తోడ్పడుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. సూర్యాస్తమయం లోపు భోజనం చేయటం కుదరకపోతే రాత్రిపూట వీలైనంత త్వరగా తినటం మంచిది. ఘనాహారం తక్కువగా, ద్రవాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

నిద్ర:

ప్రకృతి మనకిచ్చిన పెద్ద వరం నిద్ర. శరీరానికి అవసరమైన విశ్రాంతినిచ్చేది ఇదే. నిద్రపోతున్నప్పుడు జీవక్రియలన్నీ మందగిస్తాయి. కణాలు, కణజాలం మరమ్మతు అవుతాయి. కాబట్టి కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. పెద్దవాళ్లకు రోజుకు 6-9 గంటల నిద్ర అవసరం. ఇందుకు ముందు నుంచే సన్నద్ధం కావాలి. పడుకోవటానికి రెండు గంటల ముందే ఇంట్లో వెలుతురు తగ్గించెయ్యాలి. టీవీలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివన్నీ కట్టేయాలి. మంచి పుస్తకం చదువుకోవటం, సంగీతం వినటం, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడుకోవటం వంటివి మేలు చేస్తాయి. వీలైతే ప్రాణాయామమూ చేయొచ్చు. ఇవి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి, కాస్త నీళ్లు తాగి నిద్రకు ఉపక్రమించాలి.

ABOUT THE AUTHOR

...view details