Child Care During Monsoon : వర్షాకాలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పగలు ఒకరకంగా, రాత్రి ఒకరకంగా ఉండే ఉష్ణోగ్రతలకు తగినట్లుగా పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమల బెడద కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక అప్రమత్తంగా ఉండాలి. ఫ్లూ, జ్వరం, జలుబు లాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం చూడగలిగితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ అప్రమత్తతల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. చినుకులు పడటమే ఆలస్యం, పిల్లలకు జలుబు, దగ్గు అంటూ రకరకాల సమస్యలు వస్తాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధులు త్వరగా వారికి వచ్చేస్తాయి. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీటిలో రకరకాల బ్యాక్టీరియాలు చేరడం కూడా పిల్లల అనారోగ్యానికి కారణాలు. మరీ ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిన్నారులపై వైరస్ దాడి మొదలవుతుంది. పిల్లలకు వెచ్చటి బట్టలు వేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను కాపాడాలి. వర్షాకాలంలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటారు. కాబట్టి తరచూ డైపర్లు మార్చాలి.
'వర్షాకాలంలో ముఖ్యంగా గాలి, నీరు, ఆహారం, దోమలు, ఈగల ద్వారా చిన్నారులకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. గాలి ద్వారా ఫ్లూ వ్యాపిస్తుంది. అదో వైరస్. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్లూ చిన్నారుల శరీరంలోకి ప్రవేశించి జలుబు, దగ్గు, జ్వరం వచ్చేలా చేస్తుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పిల్లలు.. ముఖ్యంగా ఏడాది కంటే తక్కువ వయసు ఉండే చిన్నారుల్లో ఫ్లూ త్వరగా ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో తాగే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి కలుషితమైన నీటిని తాగితే చిన్నారులు రోగాల బారిన పడతారు. తినే ఆహారం కలుషితమైనా వ్యాధులు సంక్రమిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి' అని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
కలుషితమైన నీరు, ఆహారం తీసుకుంటే చిన్నారులు కలరా, టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడతారని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ లాంటి వ్యాధులు జులై నుంచి సెప్టెంబర్ వరకు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడతాయని ఆయన పేర్కొన్నారు. డెంగీ తీవ్రమైన వ్యాధి అని.. దీని వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. పిల్లలకు ఏ పూటకు ఆ పూట తాజాగా వండిపెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే బొప్పాయి, దానిమ్మ, నేరేడు, యాపిల్ వంటి పండ్లను పిల్లలకు ఎక్కువగా ఇవ్వాలని చెబుతున్నారు.