తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే.. - bulgarian beauty tips

వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని పెంచుకోవడానికి ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకుంటారు ఈ బల్గేరియన్ బ్యూటీస్‌. మరి, ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా?

bulgarian-beauty-secrets-in-telugu
బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

By

Published : Jul 18, 2020, 10:31 AM IST

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. కానీ, బల్గేరియన్​ యువతులు మాత్రం మేకప్​ వాడాల్సిన పనే లేకుండా.. వారి సౌందర్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్​ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

ఎండ వల్ల కమిలిన చర్మానికి..

సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడం, కమిలిపోవడం.. వంటివి కామన్. ఇలా జరగకుండా ఉండడానికే సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం మనకు అలవాటు. అయినా కొన్నిసార్లు ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఈ చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి బల్గేరియన్ మగువలు ఉపయోగించే సహజసిద్ధమైన సౌందర్య సాధనం పెరుగు. ఇందులో గాయాన్ని నయం చేసే గుణాలుంటాయి. కాబట్టి సమస్య ఉన్న చోట చర్మంపై పెరుగు రాసి కాసేపు అలాగే ఉంచుకొని కడిగేసుకుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. చర్మం కూడా మృదువుగా మారుతుంది.

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

అన్నింటికీ 'గులాబీ నీరు'!

బల్గేరియా గులాబీలకు పెట్టింది పేరు. అక్కడ రోజ్ వ్యాలీల పేరుతో ఎక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల గులాబీ తోటలను పెంచుతుంటారు. ఇక ఈ పూల నుంచి రోజ్ వాటర్‌ను తయారుచేయడం, గులాబీ పూల ఎక్స్‌ట్రాక్ట్‌ను వివిధ రకాల సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం ఇక్కడ మంచి కాస్మెటిక్ వ్యాపారం. అందుకే ఇక్కడి మగువలు గులాబీ నీటితో తమ అందాన్ని సంరక్షించుకుంటారు. చర్మాన్ని శుభ్రపరచుకోవడం దగ్గర్నుంచి, మొటిమలు-మచ్చలు, జిడ్డుదనం.. వంటి సమస్యల్ని దూరం చేసుకోవడానికి ఈ రోజ్ వాటర్‌ని వివిధ రకాల ఫేస్‌ప్యాక్‌లలో భాగం చేసుకోవడం బల్గేరియన్ మహిళలకు అలవాటు. అలాగే గులాబీ నీటిని వివిధ రకాల హెయిర్ మాస్కుల్లోనూ వాడుతూ జుట్టు ఆరోగ్యాన్నీ కాపాడుకుంటారీ ముద్దుగుమ్మలు.

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

'తేనె'లాంటి అధరాలకు..!

సాధారణంగా శీతాకాలంలో, లేదంటే వాతావరణం కాస్త చల్లగా మారినప్పుడు చర్మం, పెదాలు.. వంటి సున్నితమైన భాగాలు పొడిబారి పగలడం మనం గమనిస్తుంటాం. కానీ కొందరి పెదాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ పొడిబారి నిర్జీవమైపోయినట్లుగా కనిపిస్తాయి. అలాంటి వారు ఉపశమనం కోసం బయట దొరికే లిప్‌బామ్‌లను రాసుకుంటుంటారు. కానీ బల్గేరియా మగువలు మాత్రం పెదాలు పొడిబారిన సమస్యను తగ్గించుకోవడానికి తేనెను ఉపయోగిస్తుంటారు. రోజూ రాత్రి పడుకునేటప్పుడు కాస్త తేనెను పెదాలపై రాసుకొని నెమ్మదిగా మర్దన చేసుకుంటారు. తద్వారా మరుసటి రోజు ఉదయానికి పెదాలు మృదువుగా మారతాయి. కేవలం అధరాలు పగిలినప్పుడే కాదు.. ఇలా రోజూ చేయడం బల్గేరియన్ అతివలకు అలవాటు. అందుకే వారి పెదాలు ఎప్పుడూ దొండపండులా ఎర్రగా, పాలమీగడ కంటే మృదువుగా కనిపిస్తుంటాయి.

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

ఆలివ్‌లో దాగున్న మృదుత్వం!

పెదాలే కాదు.. కాలంతో సంబంధం లేకుండా కొంతమందిలో చర్మం కూడా పొడిబారి నిర్జీవమైపోతుంటుంది. ఇలాంటి సమస్యకు బల్గేరియన్ మహిళలు పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతి ఆలివ్ నూనె. స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఆలివ్ నూనెను ఒంటికి, ముఖానికి పట్టించుకుంటారు అక్కడి మహిళలు. తద్వారా ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు.. ఇలా తరచూ చేయడం వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా, కోమలంగా మారుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి అక్కడి మహిళలు బేకింగ్ సోడాను కూడా ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం ఒక కాటన్ ప్యాడ్‌పై కాస్త బేకింగ్ సోడాను వేసి దాంతో ముఖం, మెడ, చర్మంపై కాసేపు మృదువుగా మర్దన చేసుకుంటారు. ఈ ప్రక్రియ కూడా చర్మాన్ని కోమలంగా మార్చడంలో సహాయపడుతుంది.

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

అలసిన కళ్లకు సాంత్వన ఇలా!

తగినంత నిద్ర లేకపోయినా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించినా, వాతావరణ కాలుష్యం.. ఇలా కారణమేదైనా సరే.. ఆ ప్రభావం కళ్లపై పడుతుంది. తద్వారా కళ్లు అలసటకు గురవడం, ఉబ్బడం, ఎరుపెక్కడం.. వంటివి జరుగుతుంటాయి. మరి, ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి బల్గేరియన్ మగువలు ఎక్కువగా ఉపయోగించేది చామొమైల్ టీ బ్యాగ్స్. బాగా మరుగుతున్న నీటిలో రెండు చామొమైల్ టీ బ్యాగుల్ని వేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై స్టౌ కట్టేసి.. ఈ నీరు పూర్తిగా చల్లారాక ఆ రెండు టీ బ్యాగుల్ని రెండు కళ్లపై పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు సేదతీరాలి. తద్వారా కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే.. తొక్క చెక్కేసిన బంగాళాదుంప స్త్లెసులతో మర్దన చేయడం, లేదంటే ఉడికించిన బంగాళాదుంప స్త్లెసుల్ని ఇరవై నిమిషాల పాటు కళ్లపై ఉంచుకొని రిలాక్సవడం.. వంటివి చేయాలి.

బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

పాదాల సంరక్షణ కోసం..

  • బల్గేరియాలో లిండెన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్లకు పూచే పూలతో తమ పాదాల్ని సంరక్షించుకుంటుంటారు అక్కడి మగువలు. ఆ పూలను నీటిలో పది నిమిషాల పాటు మరిగిస్తారు. ఆ నీరు చల్లారాక వడకట్టి.. పాదాల్ని ఆ నీటిలో నాననిస్తారు. తద్వారా పాదాల భాగంలో ఉండే గరుకైన, కఠినమైన చర్మం మృదువుగా మారుతుంది.
  • పాదాల్ని మృదువుగా మార్చుకోవడానికి ఈ దేశపు మహిళలు అనుసరించే మరో న్యాచురల్ రెమెడీ పాలు-తేనె. కొన్ని పాలల్లో టేబుల్‌స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమంలో పాదాల్ని పదిహేను నిమిషాల పాటు నానబెడతారు. ఇలా తరచూ రాత్రుళ్లు నిద్రపోవడానికి ముందు చేస్తారు. ఫలితంగా మరుసటి రోజుకి పాదాలు మృదువుగా మారతాయనేది వారి నమ్మకం.
  • ఒక పెద్ద బౌల్‌లో గోరువెచ్చటి నీటిని తీసుకొని అందులో గుప్పెడు ఉప్పు, కొన్ని పుదీనా ఆకుల్ని వేయాలి. ఈ మిశ్రమంలో పాదాల్ని కాసేపు ఉంచి రిలాక్సవడం వల్ల పాదాలకు సాంత్వన చేకూరడంతో పాటు మడమలూ మృదువుగా మారతాయి.
బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

ఏ చర్మానికి ఏది వాడాలి?

  • జిడ్డు చర్మతత్వంతో బాధపడే బల్గేరియన్ మగువలు తమ జిడ్డును తగ్గించుకోవడానికి తేనె, టొమాటో జ్యూస్‌లను ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, టొమాటో రసం.. తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకొని.. ఆపై కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
  • ఇక పొడి చర్మతత్వం గల వారు టేబుల్‌స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.
బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

ఈ ఆహారంతో సౌందర్యం!

  • సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులతోనే కాదు.. మంచి డైట్ నియమాలతోనూ అందాన్ని సంరక్షించుకుంటారు బల్గేరియన్ అతివలు.
  • ఎలాంటి రసాయనిక ఎరువుల ఉపయోగం లేకుండా సహజ ఎరువుల్ని ఉపయోగించి పండించిన కాయగూరలు, పండ్లను తీసుకోవడం అక్కడి మగువల సౌందర్య రహస్యంగా చెప్పకోవచ్చు. ఈ క్రమంలో టొమాటో, కీర, బీన్స్.. వంటి పదార్థాలతో పాటు బెర్రీస్, చెర్రీస్, ద్రాక్ష, ఆప్రికాట్స్, పీచ్.. వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వారికి అలవాటు.
  • ఇతర దేశాలతో పోల్చితే వీరు మాంసం తక్కువగా తీసుకుంటుంటారు. ఒకవేళ తీసుకున్నా.. వాటిని సన్నటి మంటపై కాల్చుకొని (గ్రిల్డ్) తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ని అదుపు చేసే యాంటీఆక్సిడెంట్లు నశించకుండా ఉంటాయనేది వారి భావన.
  • పెరుగును సౌందర్య సాధనంగానే కాదు.. రోజువారీ ఆహారంలోనూ భాగం చేసుకుంటుంటారు బల్గేరియన్ అతివలు. తద్వారా ఈ పదార్థంలో ఉండే ల్యాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఇక నీళ్లు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం, చక్కెర వాడకం తగ్గించడం, హెర్బల్ టీలు ఎక్కువగా తాగడం, సలాడ్స్-జ్యూసులు రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం.. వంటి ఆహార నియమాలతో అటు అందాన్ని, ఇటు ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవడం బల్గేరియా భామలకు అలవాటు.

బల్గేరియా మగువల బ్యూటీ సీక్రెట్స్ గురించి చదువుతుంటే ప్రకృతే సౌందర్య సాధనం అన్న మాటలు అక్షర సత్యం అనిపిస్తున్నాయి కదూ! మరి, మనమూ వారిలా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతోనే అందాన్ని పెంపొందించుకుందాం!!

ఇదీ చదవండి:శనగలతో బరువు తగ్గుతారు.. ఇమ్యూనిటీ పెరుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details