తెలంగాణ

telangana

కొత్త ఏడాదిలోనే... యాదాద్రి ఆలయ పునఃప్రారంభం...

కొత్త ఏడాదిలో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి వరకు పనులన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ గడువు నిర్ధేశించారు. అందుకు అనుగుణంగా పనులను పూర్తి చేసే విషయమై అధికారులు దృష్టి సారించారు. ఆలయ ప్రధాన పనులు పూర్తి కాగా... మిగిలిన పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే సీఎం... యాదగిరిగుట్టను సందర్శించే అవకాశం ఉంది.

By

Published : Dec 19, 2020, 4:57 AM IST

Published : Dec 19, 2020, 4:57 AM IST

yadadri temple re open in new year
yadadri temple re open in new year

అద్భుత శిల్పసౌందర్యంతో చారిత్రక సౌందర్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక వాతావారణం వెల్లివిరిసేలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు... తుదిదశకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయం నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా చివరి పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో ఆలయాన్ని పునఃప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని గత నెలలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​... అధికారులను ఆదేశించారు. ప్రధానాలయ పనులు పూర్తైన నేపథ్యంలో ఇతర పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులన్నింటినీ పూర్తి చేసి పునఃప్రారంభానికి ఆలయాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగా యాదాద్రిలో పనులు వేగవంతం అయ్యాయి.


పుష్కరిణి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కళ్యాణకట్ట పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కాటేజీలు కూడా సిద్ధమయ్యాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. మొత్తం 15 కాటేజీల్లో ఒకటి మినహా అన్నిటి పనులు పూర్తయ్యాయి. అటు.. జనవరి నెలాఖరు వరకు పనులన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​... అధికారులకు తాజాగా గడువు నిర్ధేశించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి వరకు కళ్యాణకట్ట పూర్తి కాకపోయినప్పటికీ దానికి సమీపంలోనే నిర్మించిన దీక్షామూర్తుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా వినియోగించుకోవచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం ఆదేశాలకు అనుగుణంగా జనవరి నెలాఖరు నాటికి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం సహా తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానం చేసేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతాయని అంటున్నారు. అటు త్వరలోనే ముఖ్యమంత్రి మరోమారు యాదగిరిగుట్టను సందర్శించిన పనుల పురోగతిని పరిశీలిస్తారని అంటున్నారు.

ఇదీ చూడండి: శరవేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details