Yadadri Temple EO Geetha Reddy Resigns : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో రాజీనామా లేఖను అందించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో గీతారెడ్డి సుదీర్ఘ కాలం సేవలందించారు. యాదాద్రి ఆలయ ఈవోగా సుమారు 9 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.
ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు - 23న సీతారాముల వైకుంఠ ద్వార దర్శనం
Yadadri Latest News : 2014లో గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా నియామకమయ్యారు. 2020లో యాదాద్రి ఈవోగా పదవీ విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం గీతారెడ్డినే ఈవోగా కొనసాగించింది. ఆలయ ఈవోపై స్థానిక ప్రజలు, అధికారుల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజల్లో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పని తీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్థానిక భక్తులు రోజువారీ దర్శనానికి కాకుండా, కేవలం శనివారం మాత్రమే దర్శనానికి రావాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. 2020లో ఆలయ ఈవోగా గీతారెడ్డి పదవీ కాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం తిరిగి నియమించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలు విధించి కింది స్థాయి ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో స్థానిక జర్నలిస్టులపై సైతం అనేక ఆంక్షలు విధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు.