తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే నూతన ఆలయంలో యాదాద్రీశుడి దర్శన భాగ్యం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు త్వరలోనే నూతన ఆలయంలో స్వామివారి దర్శనభాగ్యం కలుగనుంది. సీఎం కే.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచినట్లు యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించి త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

yadadri-lakshmi-narasimha-swamy-temple-will-be-started-seen-soon
త్వరలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనభాగ్యం

By

Published : Dec 29, 2020, 1:23 PM IST

Updated : Dec 29, 2020, 8:13 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులన్నింటిని వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) చర్యలు ప్రారంభించింది. ఆలయ నిర్మాణంతో పాటుగా భక్తులకు వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనుల్లో వేగం పెంచింది.

భక్తులకు వచ్చే ఏడాదిలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి భూపాల్ రెడ్డి ఇటీవల యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించి వచ్చే నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రధానాలయంతో పాటు కొండపై చేపట్టిన కట్టడాలన్నింటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిందిగా యాడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యాడా వైస్ ఛైర్మన్ జి.కిషన్​రావు, ఈ.ఎన్.సి రవీందర్ రావు, గణపతి రెడ్డి, కొండల్ రావు ఎప్పటికప్పుడు క్షేత్రాభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.

త్వరలోనే నూతన ఆలయంలో యాదాద్రీశుడి దర్శన భాగ్యం

బాలాలయం కుదింపు

ప్రధానాలయంలో మండప ప్రాకారం వెలుపలి దిశలోని సాలహారాల్లో బిగించాల్సిన విష్ణుమూర్తి రూపాలతో కూడిన విగ్రహాలను వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర దిశలో ఉన్న ఆలయ మాడ వీధిని బాలాలయం వరకు విస్తరించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇక్కడ నిర్మిస్తోన్న ప్రహరీ కోసం బాలాలయాన్ని కొంతమేర కుదించారు. కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపడుతున్నట్లు యాడా అధికారులు తెలిపారు. శివాలయం పునర్నిర్మాణంతో పాటుగా ప్రహరీ, స్వాగత తోరణం, కళ్యాణ మండపం పనులను గడువులోగా పూర్తి చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంపూర్ణంగా ఒకే జాతికి చెందిన నల్లరాతితో నారసింహుడి సన్నిధి మహా దివ్యంగా త్వరలోనే ఆవిష్కృతం కానుంది.

ప్రధానాలయంలో ఇత్తడి గ్రిల్స్ బిగింపు

ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటవుతున్న దర్శన వరుసల సముదాయాన్ని అధికారులు ఆకర్షణీయంగా మార్చనున్నారు. పుష్కర ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కొనసాగించే ప్రదేశాన్ని ఆలయ రూపంలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా తయారైన స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్​ను ఇప్పటికే పైఅంతస్తులో బిగించగా మరో అంతస్తులో ఏర్పాటు చేయడం కోసం సామాగ్రిని సమకూర్చారు. ప్రధానాలయంలో ఇత్తడి గ్రిల్స్ బిగిస్తున్నారు. మెట్లు ఎక్కలేని వారికోసం పుష్కరిణి ప్రాంగణం నుంచి ఆలయం వరకు ఏర్పాటయ్యే ఎస్కలేటర్ కోసం పనులు కొనసాగుతున్నాయి.

ప్రసాదం విక్రయానికి ప్రత్యేక కార్యాలయం

యంత్రాలతో ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయ కార్యాలయం పనులు చకచకా సాగుతున్నాయి. బెంగళూరుకు చెందిన ట్రైడాస్ సంస్థ ఈ పనులను చేపడుతోంది. 2500 చదరపు గజాల్లో నిర్మిస్తోన్న ఈ కార్యాలయంలో ప్రసాదాన్ని విక్రయించడం కోసం 13 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడు అంతస్తుల ఈ నిర్మాణంలో బూంది తయారీకి ఒక అంతస్తు, యంత్రాల సాయంతో లడ్డూ తయారీకి మరొకటి, నిల్వ, అమ్మకాలకు మరొక అంతస్తు కేటాయించారు. మూడు నెలల్లోగా ఈ నిర్మాణం పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:అమెరికాలో నల్గొండ జిల్లా వాసి సజీవదహనం

Last Updated : Dec 29, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details