యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్ర పరిధిలోని కామునిగూడెంలో 1 కోటి 37 లక్షల రూపాయలతో రెండు చెక్ డ్యాంల నిర్మాణాలకు ఆదివారం నాడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు శంకుస్థాపనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కానీ ఆలేరు ప్రాంతానికి వచ్చే నీటిని జనగామకు తరలించుకొనిపోవడం సరికాదని మండిపడ్డారు. బునాదిగాని కాల్వ నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా దానిని పట్టించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రైతుబంధు కర్షకుల మీద ప్రేమతో కాదు...
రైతు బంధు పథకం అనేది ఎన్నికల కోసం ఏర్పాటు చేసిందే తప్ప... రైతుల మీది ప్రేమతో కాదని ఎంపీ పేర్కొన్నారు. రైతులు మేధావులు... వారికి ఏ సమయంలో ఏ పంట ఎక్కడ వేయాలో తెలుసు అన్నారు. కంది పంటను విక్రయించి 3నెలలు గడుస్తున్నా ఇంకా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడకపోవడం శోచనీయమన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో వరికి రూ.700 బోనస్...
ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి కేంద్ర ఇచ్చే మద్దతు ధరకి 700 రూపాయల బోనస్ కలిపి ఇస్తుంటే... తెరాస ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రూ.1,835 మాత్రమే ఇస్తుందన్నారు. అందులో 4 కిలోలు వెయిట్ లాస్ కింద కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అన్నదాతల సంక్షేమం కోసం పనిచేసేందుకు ఆలోచించాలని సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.