యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువలా వస్తున్నాయి. బంగారు తాపడం కోసం 6 కిలోల బంగారాన్ని అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రాక్చర్స్ లిమిటెడ్- (MEIL) డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి.. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పిలుపు మేరకు ముందుకొచ్చినట్లు మేఘా సంస్థ ప్రకటించింది.
శ్రీలక్ష్మీనరసింహ త్వరలోనే ఆరు కిలోల బంగారం కానీ... అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో కానీ అందిస్తామని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు యాదాద్రి విమాన గోపురం కోసం రెండు కిలోల బంగారం విరాళం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు.. జలవిహార్ తరపున కిలో బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు.
తొలి విరాళం సీఎందే...
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.