కూరగాయలే అమ్మవారికి బంగారు ఆభరణాలయ్యాయి. 1250 కేజీల కూరగాయలతో వరంగల్ భద్రకాళి అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారి శాకంబరీ విశ్వరూప దర్శనం భక్తులను విశేషంగా అలరించింది. బెండ, బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, క్యాబేజీ, పండ్లు, ఆకుకూరలు ఇలా 72 రకాలతో 1250 కేజీల మేర అమ్మవారి అలంకరణ కోసం వినియోగించారు.
గతంలో సికింద్రాబాద్, ఇతర మార్కెట్ల నుంచి కూరగాయలను తెచ్చే అర్చకులు... ఈసారి పూర్తిగా సేంద్రియ కూరగాయలతో అలంకరణ చేశారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లోని తోటలకు వెళ్లి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తెచ్చి కన్నులపండువగా అలంకరించారు. కరవు,కాటకాలు లేకుండా అందరినీ చల్లగా చూసేందుకు... అమ్మవారు శాకంబరీగా భక్తుల చేత పూజలందుకుంటోంది.