ప్లాస్టిక్ రహిత ఉర్సు చేద్దాం: వినయ్ భాస్కర్ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఈ నెల 27 నుంచి నిర్వహించే దర్గా ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులతో కలిసి సమీక్షించారు. దర్గాను సందర్శించిన చీఫ్ విప్ ప్రత్యేక పూజలు చేసి పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్లాస్టిక్ రహితంగా జరుపుకునేలా భక్తులకు అవగాహన కల్పిస్తూ నిర్వహించాలని వినయ్ భాస్కర్ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.