గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయం మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో పలుచోట్ల తెరాస అభ్యర్థుల తరఫున పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లోని పలు డివిజన్ల పరిధిలో అభ్యర్థులు ఉదయం నుంచే ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరికొన్ని గంటలే గడువు.. ఓట్ల వేటలో అభ్యర్థులు
మరికొన్ని గంటల్లో ప్రచార సమయం ముగుస్తుండగా అభ్యర్థులు జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
నగరంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్, జనసేన అభ్యర్థులు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. ఇక తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజా ప్రతినిధులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో అభ్యర్థులు డివిజన్లను చుట్టేస్తున్నారు. కాకతీయ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు