Medical Students Protest at MGM: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్ పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ సైఫ్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దంటూ ఎంజీఎంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పోలీసుల విచారణ బాధితురాలికి మద్దతుగా జరుగుతుందని.. విచారణను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్ చేశారు.
సైఫ్‌పై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా ఓపీ, మిగిలిన సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించారు. సైఫ్‌కు మద్దతుగా విద్యార్థులు ధర్నాకు దిగడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఈ మేరకు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రిలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ వృత్తిలో జూనియర్లను సీనియర్లు వర్క్ విషయంలో మందలించడం సహజమేనని పేర్కొన్న విద్యార్థులు.. ఇది కొత్తేమీ కాదన్నారు. సైఫ్‌పై కేసులను ఎత్తివేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. పీజీ వైద్య విద్యార్థుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడ్డారు.