ఈ ఏడాది మార్చి 19న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంతలో కరోనా విజృంభిస్తుండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను నిలిపివేసింది. తిరిగి నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు పంపగా వాటిని కోర్టుకు సమర్పించింది. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం జూన్ 8 నుంచి నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
పెరగనున్న కేంద్రాలు..
విద్యార్థుల మధ్య భౌతిక దూరం తప్పనిసరవడం వల్ల పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక గదిలో ఇది వరకు 20 నుంచి 24 మంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 12 నుంచి 15 మంది పరీక్ష రాస్తారు. ఆరు జిల్లాల్లో గతంలో 236 కేంద్రాలు ఉండగా అదనంగా 137 కేంద్రాలను పెంచేందుకు ప్రతిపాదనలు పంపించారు.
అదనపు సిబ్బంది అవసరం
కేంద్రాలతో పాటు సిబ్బంది సంఖ్యనూ పెంచనున్నారు. గతంలో 3743 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. ఇప్పుడు మరో 1807 మంది అవసరమని అధికారులు నిర్ణయించారు. సీఎస్‌లు, డీఎస్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 708 మంది ఉండగా అదనంగా 411 మందిని పెంచనున్నారు.
ఆర్టీసీతో రవాణా..
ఆర్టీసీ బస్సులను పరీక్ష సమయాలకు అనుగుణంగా నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా విద్యాధికారులు పరీక్ష కేంద్రాలకు ఏయే రూట్లలో విద్యార్థులు రానున్నారో ఆర్టీసీ అధికారులకు లేఖలు ఇవ్వనున్నారు. ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.
పలు జాగ్రత్తలు..
ఆయా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు. భౌతిక దూరం ఉండేలా మూడడుగుల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టనున్నారు. పరీక్ష కేంద్రాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయించనున్నారు. భద్రత దృష్ట్యా పోలీస్ సిబ్బంది, ఆరోగ్య పరంగా వైద్యసిబ్బంది ఉంటారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులకు మాస్కులు ఇస్తాం
పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి సెంటర్‌లో 100 మంది పరీక్షలు రాసేవిధంగా చూస్తున్నాం. 300 లీటర్ల రసాయన ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం. విద్యార్థుల కోసం 13,000 మాస్కులను సిద్ధంగా ఉంచాం. ఉపాధ్యాయులకు మాస్క్, గ్లౌజ్‌లు ఇస్తాం.