పల్లెప్రగతిలో భాగంగా పచ్చదనం పెంపోదించడంలో ఉపాధి కూలీలు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమడ్ల గ్రామంలో శుక్రవారం పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించారు. రోడ్ల వెంట మొక్కలు నాటి, వాటికి ముళ్ల కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపునకు విరివిగా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రవేశం నుంచి రహదారికి ఇరువైపులా పచ్చదనంతో గ్రామాలకు కొత్త శోభ తీసుకురావాలన్నారు.
అందరి బాధ్యత
పల్లె ప్రగతి కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని కోరారు. నాటిన మొక్కలు వంద శాతం మనుగడ పొందేలా, కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఆహ్లాదకరంగా కొంత సమయం గడపడానికి, మంచి గాలితో పాటు శారీరక ధృఢత్వానికి ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లతో రాష్ట్రంలోని ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.