నడమంత్రపు వానలు.. పత్తిరైతుకు కష్టాలు... దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకూ నానా కష్టాలు పడుతూ పంటను పండిస్తారు అన్నదాతలు. కానీ తీరా చేతికొచ్చే సమయంలో ఆ పంట తడిసిముద్దై ఎందుకూ పనికిరాకుండా పోతే ఆ రైతుల బాధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పత్తి రైతుల గోస ఇదే. పత్తి విత్తే సమయంలో వర్షాభావ పరిస్ధితులు పత్తి రైతులను ఆందోళనకు గురి చేశాయ్. ఆగస్టు వరకు వాన జాడ కనిపించలేదు. ఏపుగా పెరగాల్సిన పత్తి మొక్క మూరెడు కూడా పెరగలేదు. ఆ తరువాత ఆలస్యంగానైనా వరుణుడు కరుణించడంతో రైతులు సంబరపడ్డారు. కానీ తీరా పంట చేతికందే సమయంలో వరుణుడు పగబట్టాడా అన్నట్లుగా వర్షాలు కురిపిస్తూనే ఉన్నాడు. చేతికొచ్చిన పంట రైతు కోయకుండానే నీటి పాలౌతోంది.
ఇదే అదునుగా వ్యాపారులు దోచేస్తున్నరు
వర్షాలకు పత్తికాయలు పగిలి, కుళ్లిపోయి నేలరాలుతున్నాయి. తడసిపోయిన పత్తి క్రమంగా నల్లబారుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో చీడపురుగులు, తెగుళ్లు విజృంభిస్తున్నాయి. కూలీలకు రెట్టింపు ధరలిచ్చి పత్తిని ఏరాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇదే అదునుగా వ్యాపారులు రైతులను దోచేస్తున్నారు. పత్తి రంగు బాగోలేదని, తడిసిపోయిందని, తేమ ఎక్కువుందని, ధరలను సగానికి సగం తగ్గించేస్తున్నారు. క్వింటా పత్తి ధర కనీసం రెండు వేలు కూడా పలకట్లేదు. పంటకు పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవటం వల్ల ఏం చేయాలో తెలియక రైతులు తల్లడిల్లుతున్నాడు.
తడి, పొడి పత్తిని వేర్వేరుగా తీసుకురావాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 83 వేల 500 ఎకరాల్లో పత్తి సాగవగా... ఇందులో మూడు లక్షల ఎకరాల్లో మొదటి దశలో వచ్చే పంటకు వర్షం, తెగుళ్లు కారణంగా నష్టం వాటిల్లింది. ఆరు లక్షల క్వింటాళ్ల మేర దిగుబడులకు నాశనమయ్యాయి. వర్షాలు ఇలానే కొనసాగితే నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. పంట నష్టపోయిన రైతులు కనీస ధర రాకపోవటం వల్ల మరింత బేజారెత్తిపోతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్కు ఈ సీజన్లో ఇప్పటిదాకా 50 వేల క్వింటాళ్ల కొత్త పత్తి వచ్చింది. గతేడాది ఇదే సమయానికి లక్షా యాభై వేల క్వింటాళ్ల మేర పత్తి వచ్చింది. ఇప్పటివరకూ లక్ష క్వింటాళ్ల పత్తి తగ్గుదల కనిపించింది. తడచిన పత్తి, పొడి పత్తి కలిపి రైతులు తీసుకురావడం వల్ల ధర తక్కువుగా వస్తోందని వేర్వేరుగా తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు.
పత్తి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
నేటి నుంచి జిల్లాలో సీసీఐ ద్వారా కూడా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎనుమామాల మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. నవంబర్ నెల మొదలవుతున్నా ఇంకా వర్షాలు పడుతుండటం... రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదే రీతిన మరో పక్షం రోజులు కొనసాగితే... ఇంకా పూర్తిగా పత్తి పంటపైన ఆశలు వదలుకోవల్సిందేనని అన్నదాతలు చెబుతున్నారు. వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'