ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రినే ఎంచుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు Wanaparthy Government Maternity Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అంటేనే హడలెత్తిపోయే ప్రజలు నేడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకునేందుకు బారులు తీరిన వైనం వనపర్తి జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగుతోంది... మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీల పట్ల వారు తీసుకునే జాగ్రత్తలు వల్ల ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా ఈ ప్రభుత్వ ప్రసూత్రి ఆసుపత్రికి తీసుకొచ్చేలా చేస్తుంది.
ప్రవేట్ ఆసుపత్రులకు తీసిపోకుండా: ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోనే టీపా స్కానింగ్ లాంటి ఖరీదైన స్కానింగ్ సైతం చేస్తున్నారు. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు కావలసిన అన్ని పరీక్షలు చేస్తూ టీకాలిస్తూ, గర్భిణీలకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలను నిరాటంకంగా అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో సైతం ఇతర ప్రాంతాలకు సిఫారసు చేయకుండా ఎంత ఇబ్బందిగా ఉన్న ఇక్కడే ప్రసవం చేస్తున్నామని అందుకు ఎంతో సంతోషంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
వైద్యం కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు: అప్పుడే పుట్టిన బిడ్డలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని. ప్రస్తుతం ఇక్కడ 12 ఫోటో థెరపీ పరికరాలతో చిన్నారులకు అన్ని విధాల వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రసూతి ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేసి కేవలం సంవత్సర కాలమే గడుస్తున్న ప్రసవాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు.
ఏటా పెరుగుతున్న ప్రసవాల సంఖ్య: రోజుకు 20 నుంచి 25 ప్రసవాలతోపాటు ఒక్కరోజు 30 దాకా కూడా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలకు దాదాపు 200 ప్రసవాలు చేయడం విశేషం అయితే అందులో సగానికి పైగా సహజ ప్రసవాలే నమోదు కావడం విశేషం. మొదట్లో సంవత్సరానికి కేవలం 1000 నుంచి 1300 ప్రసూతి కేసులు నమోదయ్యవని ప్రస్తుతం 3000 నుంచి 3500 వరకు ప్రసవాలు చేస్తున్నమని వైద్యులు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాల ప్రసూతి విభాగంలో మంచి సేవలు అందిస్తున్నారని గుర్తించి గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం అధిక సంఖ్యలో మహిళలు ప్రసవం కోసం ఆసుపత్రికి రావడం విశేషం అన్నారు.
"ప్రతినెల దాదాపు 400 ప్రసవాలు చేస్తున్నాం. రోజురోజుకు అవుట్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 3000 మందికి పైగా వైద్యం అందించాం. అది కాకుండా గైనిక్ కేసులు కూడా చుస్తున్నాం. గత నెల ఓపీల సంఖ్య అధికంగా వచ్చింది. మా సేవలు నచ్చి ఇతర జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం వస్తున్నారు."-ప్రసూతి విభాగం హెచ్వోడి
సదుపాయాలు పెంచితే ఇంకా మెరుగైన వైద్యం అందించగలుగుతాం: పెరుగుతున్న ప్రసూతి కేసులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ గుండె సంబంధిత వైద్యులను నియమించాలని, దాంతో పాటు ఐసీయూ యూనిట్ ని కూడా ఏర్పాటు చేయాలని పెరుగుతున్న జనాభాకు నిరాటంకంగా వైద్య సేవలు అందించాలంటే తగిన వైద్య సిబ్బంది ఉండాలని వైద్యులు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అంటేనే భయపడే తాము నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకునేందుకు ఎలాంటి భయం లేకుండా వస్తున్నామని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందించే వైద్యులు సైతం పుట్టిన బిడ్డను బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని గర్భిణులు బాలింతలు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: