ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైనట్లు మంత్రి వివరించారు. వనపర్తి జిల్లా రాజాపేట, కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కోసం ఏడు వేల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఐకేపీ, పీపీఎస్ల ద్వారా పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో రైతులంతా ఒకేసారి రాకుండా ప్రతి పంచాయతీలోనూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొంటామని వెల్లడించారు. ముఖ్యంగా రైతులు ఎలాంటి పాసుపుస్తకాలు చూపించాల్సిన అవసరం లేదని... బ్యాంకు ఖాతా నెంబరు వివరాలు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు.