మొదటిసారిగా వనపర్తి జిల్లాలో మోడల్ మార్కెటును నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఈ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకానికి పంపించినట్లు సమాచారం. రాష్ట్రంలోనే మొదటిసారిగా రూ.100 కోట్ల భారీ బడ్జెటుతో మోడల్ మార్కెట్ నిర్మాణంపై సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటివరకు మూడుసార్లు చర్చించారు. సమీకృత భవనాల నిర్మాణం, హైటెక్ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అయ్యే ఖర్చు నివేదికను తయారుచేసే బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినట్లు తెలిసింది.
ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఈ మోడల్ మార్కెటును వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్నారు. సర్వే నంబరు 109లోని 43.38 ఎకరాల ప్రభుత్వ స్థలంలో మోడల్ మార్కెట్ నిర్మాణం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. మార్కెట్‌ను నిర్మించే స్థలం వనపర్తి - ఖిల్లాగణపురం ప్రధాన రహదారి పక్కనే ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. దాదాపుగా ఇక్కడే మార్కెట్ నిర్మాణం చేయాలని అధికారులు ఖరారు చేశారు.