తెలంగాణ

telangana

ETV Bharat / state

సామూహిక కళ్లం... రైతుల పాలిట వరం

సామూహిక కళ్లాలు రైతుల పాలిట వరంగా మారాయి. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కళ్లాల వద్దే ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం తమకు సౌకర్యవంతంగా ఉందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిలోని సామూహిక కళ్లాలను చూసి ఇతర గ్రామాల వారు నిర్మించుకోవాలి అనుకుంటున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.

usage of crop drying platform for farmers at anthakkapet in siddipet
అంతక్కపేటలో సామూహిక కళ్లాలు... రైతుల పాలిట వరం

By

Published : Nov 17, 2020, 11:53 AM IST

పంటను ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో నిర్మించిన కళ్లాలు రైతుల పాలిట వరంగా మారాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక్కపేటలో ఉపాధి హామీ పథకం కింద కళ్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గ్రామంలో 39 మంది రైతులు నిర్మించుకున్నారు. అందులో 15 మంది రైతులు వారి పొలాల్లోనే నిర్మించుకోగా, మరో 24 మంది రైతులు చెరువు కట్టపై ఒకే కళ్లంగా నిర్మించుకున్నారు. రైతులంతా వారు పండించిన ధాన్యాన్ని అక్కడికే తెచ్చి ఆరబెట్టుకున్నారు. అందరి ధాన్యం అక్కడే ఉండటంతో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్నీ అక్కడే ఏర్పాటు చేశారు.

ఖర్చు తగ్గింది...

రైతులకు ఈ సామూహిక కళ్లాలు ఎంతో సౌకర్యంగా మారాయి. విశాలంగా, ఎత్తుపల్లాలు లేకుండా ఉండడంతో ధాన్యం ఆరబెట్టడంతోపాటు కుప్ప చేయడం సులువుగా ఉందని అన్నదాతలు తెలిపారు. ఇదివరకు కళ్లాలు లేక చాలా ఇబ్బందులకు గురయ్యామని... ఇప్పుడు ఒకే దగ్గర ఆరబెట్టి ఇక్కడే విక్రయిస్తుండడంతో రవాణా ఖర్చు తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయోజనకరం...

రైతుల అంగీకారంతో గ్రామంలో ఒకే చోట సామూహిక కళ్లాలు నిర్మించామని, ఇప్పుడు అదే చోట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని సర్పంచ్ ఇర్రి లావణ్య తెలిపారు. చుట్టుపక్కల ఊర్లలోని రైతులూ ఈ సామూహిక కళ్లాలను చూసి తమ గ్రామాల్లోనూ నిర్మించుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సన్నరకం సాగుతో సగం దిగుబడి నష్టపోయాం: రైతులు

ABOUT THE AUTHOR

...view details