తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇల్లు కూల్చేస్తున్నారనే భయంతో కూలీ పనికి వెళ్లట్లేదు' - రహదారి విస్తరణ అంటూ నివాసాలు కూల్చేస్తున్నారు

రహదారి విస్తరణ అంటూ నివాసాలు కూల్చేస్తున్నారు... వ్యవసాయ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే... తమ గోడు పట్టించుకునే నాధుడే లేడంటూ... యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రకటన ఇవ్వకుండానే ఇళ్లు కూడా కుల్చేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

road issue at siddipet
'ఇల్లు కూల్చేస్తున్నారనే భయంతో కూలీ పనికి వెళ్లట్లేదు'

By

Published : Jan 15, 2020, 2:32 PM IST

భువనగిరి-జగదేవ్‌పూర్ రాష్ట్ర రహదారి నుంచి సిద్దిపేట జిల్లాను కలుపుతూ రూ.12.7 కోట్ల వ్యయంతో 4.6 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో వాసాలమర్రి, రాంశెట్టిపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని పొలాలు, బోరుబావులతో పాటు కొండాపూర్‌లో 20 ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్వాసితుల గురించి పట్టించుకోకుండానే పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరుకు గోడు వెళ్లబోసుకుంటే.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ పరిహారం గురించి మాట్లాడలేదని బాధితులు వాపోతున్నారు.

'ఇల్లు కూల్చేస్తున్నారనే భయంతో కూలీ పనికి వెళ్లట్లేదు'

ఈ రహదారి వెంబడి పొలాలకు సంబంధించిన బోర్లను.. ఎలాంటి సమాచారమివ్వకుండా పూడ్చివేశారు. పంటలకు నీరందించే వీలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియట్లేదంటూ బాధితులు వాపోతున్నారు. ఇల్లు కూలుస్తారేమోనన్న బెంగతో కూలీ పనికి వెళ్లట్లేమని.. పూట గడవడం కష్టంగా మారిందని బాధితులు వాపోతున్నారు.

రహదారి విస్తరణలో బాధితుల వివరాలు సేకరించి.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ అనితా రామచంద్రన్ వివరించారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటామని బాధితులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: బస్తీమేసవాల్​: బండ్లగూడ గోడు తీర్చేదెవరో...?

ABOUT THE AUTHOR

...view details