తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

దుబ్బాక ఉపఎన్నిక ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. పోలింగ్‌కు ఒక్కరోజే సమయం ఉన్నందున.. ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు యత్రాంంగం సన్నద్ధమవుతోంది. కొవిడ్‌ దృష్ట్యా... ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది.

Officials are all set for the Dubaka by-election in siddipet district
దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

By

Published : Nov 2, 2020, 5:36 AM IST

దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

దుబ్బాక ఉపఎన్నికలకు సర్వంసిద్ధమైంది. ఆదివారం సాయంత్రంతో ప్రచారాల గడువుముగియడం వల్ల స్థానికేతరులందరినీ అక్కడి నుంచి పంపించారు. నియోజకవర్గంలో మొత్తం లక్షా 98వేల807 మంది ఓటర్లుండగా.. వారిలో లక్షా 779 మంది మహిళ ఓటర్లు, 98వేల028 పురుషులు ఉన్నారు. ఉపఎన్నికకు మొత్తం 315పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ప్రక్రియ సాయంత్రం 6 గంటలవరకు కొనసాగనుంది. ప్రతి బూత్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ... ఓటు హక్కును వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఓటరుకూ చేతి తొడుగులు ఇవ్వడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పీపీఈ కిట్లతో వచ్చి ఓటువేసే అవకాశం కల్పించారు. ఓటర్ల మధ్య 5 మీటర్ల భౌతికదూరం, వీల్‌చైర్లు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటుచేస్తున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు 15వందల58 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఉపఎన్నికలో వందశాతం ఓటింగ్‌ నమోదుకు కసరత్తులు చేస్తున్నట్లు కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు.

89 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

నియోజకవర్గవ్యాప్తంగా 33ప్రాంతాల్లో 89 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి.. పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. ఇందుకోసం 4 కంపెనీల కేంద్ర బలగాలు, రెండువేలమంది రాష్ట్ర బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. విధిగా నిబంధనలను పాటిస్తూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక పూర్తయ్యేందుకు సహకరించాలని సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ కోరారు.

ముమ్మర తనిఖీలు

ఓటర్లను ప్రలోభానికి గురిచేయకుండా నియోజకవర్గంలో ప్రత్యేకంగా 21 బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 10 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి: దుబ్బాకలో ముగిసిన ప్రచార పర్వం.. ఈనెల 3న పోలింగ్

ABOUT THE AUTHOR

...view details