సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బస్వాపూర్‌లో రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం నీళ్లతో బస్వాపూర్ చెక్ డ్యామ్‌తో పాటు శనిగరం ప్రాజెక్టును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
బుక్కెడు తాగు, సాగు నీరు కోసం బాధపడ్డ బస్వాపూర్, కోహెడ మండల ప్రజల ఇబ్బందులు తొలిగాయని మంత్రి అన్నారు. వానలు పడ్డా పడకపోయినా బస్వాపూర్ చెక్ డ్యామ్‌ను గోదారమ్మ నీళ్లతో మత్తడి పోయించి... రైతులు రెండు పంటలు పండించేలా చేస్తానని తెలిపారు. గతంలో కోహెడ, బస్వాపూర్ ప్రాంత రైతులు కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేసినా నీరు పడకపోవడంతో బతుకుతెరువు కోసం బొంబాయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్లేదని... ఇకపై అలాంటి సమస్య ఉండదని తెలిపారు.