KCR Visits Konaipally Venkateswara Swamy Temple :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు శుక్రవారం రోజునఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైనందున.. ఈరోజు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు.. కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయం వద్ద ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రచార హోరు
CM KCR Visits Konaipally Today : 1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన కేసీఆర్.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తే అంతా శుభమే జరుగుతుందని.. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు చెప్పారు. అప్పటి నుంచి నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు చేయడం ఆయన మొదలు పెట్టారు. అనంతరం ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తిరుగులేని విజయం సాధించడంతో.. బరిలో నిలిచే ప్రతిసారి నామినేషన్ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా మారింది.
KCR Worship Nomination Papers Today :ఈ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ ఇక్కడ పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దీవెనలతో.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కోనాయిపల్లి గ్రామస్థులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 9న మరోసారి కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. పూజల అనంతరం.. గజ్వేల్, కామారెడ్డిలో ఆయన నామినేషన్ వేయనున్నారు. అక్కడి నుంచి కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రసగించనున్నారు.