కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన జలాశయంలోకి త్వరలో గోదావరి నీరు చేరనుంది. సిద్దిపేట జిల్లాలో 15 టీఎంసీల సామర్థ్యంతో సిద్ధమైన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ఈ నెల 29న ఉదయం 11.30కు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వచనం ఇస్తారు.
15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు. మేడిగడ్డ ఆనకట్ట ఎగువన కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద 88 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే అక్కారం పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు మార్కూక్ పంప్ హౌస్కు చేరాయి. మార్కూక్లో సీఎం మోటార్లను ప్రారంభిస్తే నేరుగా కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు వెళ్తాయి. దీంతో పదో దశ ఎత్తిపోతల పూర్తవుతుంది. ప్రాజెక్టులో చివరి ఎత్తిపోతల కూడా ఇదే.