తెలంగాణ

telangana

ETV Bharat / state

యువ బృందం.. దాతృత్వ బంధం

లాక్‌డౌన్‌ వేళ అడ్డాకూలీలు, వివిధ రంగాల్లో పనిచేసే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని దొరక్క.. నిత్యావసరాలూ కొనుక్కోలేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు సంగారెడ్జి జిల్లాలో యువ బృందాలు ముందుకొస్తున్నాయి.

sangareddy district latest news
sangareddy district latest news

By

Published : May 5, 2020, 10:59 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో​ సంగారెడ్డి జిల్లాలో ఉపాధి కోల్పోయిన వారికి యువ బృందాలు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాయి. అన్నదానాలు చేస్తూ కొందరు.. బియ్యం, ఇతర సరకులు అందిస్తూ మరికొందరు అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఆకలితో ఉంటున్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి కూరగాయలు, పప్పులు పంపిణీ చేస్తున్నారు. కాలినడకన సొంత ఊళ్లకు వెళ్తున్న వారిని గుర్తించి పోలీసుల సహకారంతో ఇళ్లకు పంపుతున్నారు.

భరోసా అందిస్తున్న ఎండీఆర్‌ ఫౌండేషన్‌...

పటాన్‌చెరు మండలం పరిధిలో కార్మికులు ఎక్కువ. ప్రస్తుతం చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారికి ఎండీఆర్‌ ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది. యువకుడు మధు నేతృత్వంలోని మిత్రులు ఇప్పటి వరకు దాదాపు 10వేల కిలోల కూరగాయలు పంపిణీ చేశారు. కార్మికులకు మాస్కులు, శానిటైజర్లూ అందిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులను గుర్తించి ప్రత్యేక సాయం అందించారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు బియ్యం అందించారు.

ఇంటింటికీ కూరగాయల పంపిణీ...

జన జాగృతి సేన పేరిట అధ్యక్షుడు బంగారు కృష్ణ నేతృత్వంలో 15 మంది యువ బృందం పనిచేస్తోంది. ఉపాధి కోల్పోయిన అడ్డాకూలీలు, కార్మికులకు వీరు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 800 మందికి అందించామని వారు చెబుతున్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజున ఈ బృందం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.

37 రోజులుగా...

సంగారెడ్డిలో ఆకలి ఫౌండేషన్‌ పేరుతో యువమిత్ర బృందం రోజూ 200 మందికి అన్నదానం చేస్తున్నారు. ఐబీ, ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వాహనంలో భోజనం తెచ్చి అందిస్తున్నారు. 37 రోజులుగా ఇది కొనసాగుతూ ఉంది. రాజశేఖర్‌ గౌడ్‌, రవిశంకర్‌, అశ్వంత్‌, ద్వారక రవి, వినోద్‌, రాజ్‌కుమార్‌, శివరాజ్‌, నర్సింహాచారి భాగస్వాములవుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్న వారి ఇబ్బందులును తీర్చుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి సాయం అందిస్తుండటం ఈ బృందం ప్రత్యేకత. ఇప్పటి వరకు 200ల మందికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. నడిచి వెళుతున్న వారికి భోజనాలు పెడుతూ.. పోలీసుల సహకారంతో ఊళ్లకు పంపేలా చొరవ తీసుకుంటున్నారు.

చేతనైన సాయం చేస్తున్న ‘మైత్రీ’...

జిన్నారం మండలానికి చెందిన ఉదయ్‌కుమార్‌ నేతృత్వంలో మైత్రీ ఫౌండేషన్‌ భిన్న రకాలుగా పేదలకు సాయం అందిస్తోంది. 15 మంది యువ బృందం చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వీరు 100 మంది పేదలకు నిత్యావసర సరకులు అందించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లకు 1,500 మాస్కులు పంపిణీ చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికోసం రేపు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు.

సాయంతో పాటు అవగాహన...

అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న కొందరికైనా సాయం చేయాలనే లక్ష్యంతో నవభారత్‌ యువ నిర్మాణ సేన సభ్యులు ముందుకెళ్తున్నారు. అనారోగ్యం బారిన పడ్డవారు, ఏ ఆసరా లేని వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. కొంత నగదు సాయమూ చేస్తున్నామని, కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా అవగాహన పెంచుతున్నామని సంస్థ అధ్యక్షుడు మెట్టుశ్రీధర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details