uncultivated leaf festival ఆకుకూరలంటే... తోటకూర, పాలకూర, బచ్చలికూర, పుంటికూర, చుక్క కూర అంటూ... ఓ పది వరకు చెబుతాం. కానీ జొన్న చెంచలి కూర, తెల్లగర్జల కూర, బంకంటి ఆకు, తలెల ఆకు, ఉత్తరేణి, ఎలక చెవుల కూర.. ఇలాంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఇవన్నీ పొలాల్లో సహజంగా పెరిగే మొక్కలే. వీటన్నింటిని మన ముందు తరాల వాళ్లు ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు మనం తింటున్న ఆకుకూరల కంటే పోషక విలువలు అధికంగా ఉంటాయి. కానీ మారిన జీవన విధానంలో ఈ ఆకుకూరలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రస్తుత తరాలకు కనీసం వీటి పేర్లు.. ప్రత్యేకతలు తెలియక కలుపు మొక్కలుగా భావిస్తున్నారు.
ఈ ఆకుకూరల కోసం విత్తనాలు చల్లాల్సిన అవసరం లేదు. నీరు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. పొలాల్లో వాటంతట అవే మొలకెత్తుతాయి. సహజంగా పెరిగే ఈ ఆకుకూరలకు ప్రచారం కల్పించేందుకు... దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ... ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పొలాల్లో ఉచితంగా లభించే అత్యధిక పౌష్ఠిక విలువలున్న ఈ ఆకుకూరల గురించి అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆసక్తి ఉన్న వారిని పొలాలకు తీసుకొచ్చి... పరిచయం చేస్తుంది. ఆకుకూరలను సేకరించి... వాటితో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పౌష్టిక విలువల వివరాలతో ఛాయాచిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఈ ఆకుకూరలను వండే విధానం... వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు.
రోజూ 150 రకాల ఆహారాలు ఉన్నాయి. కానీ వాటిని మనం గుర్తించడం లేదు. అవి పొలాల్లో వాటంతట అవే పెరుగుతాయి. అందుకే దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఆకుకూరల గురించి అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - సతీష్, డైరెక్టర్, దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ