జనసంచారాన్ని నివారించి.. కరోనా గొలుసును తెంచేందుకు పల్లెలు కంకణం కట్టుకుంటున్నాయి. కనీసం 14 రోజుల నియంత్రణ పాటిస్తే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ఆశిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాల పెద్దలు కట్టడిని అమల్లోకి తెచ్చారు. గ్రామంలో పలువురు వైరస్ బారిన పడుతుండటం, ఇరుగు పొరుగు గ్రామాల వారు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో మధ్యాహ్నంలోపే దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. వట్‌పల్లి, గుమ్మడిదల, నారాయణఖేడ్, రామాయంపేట మండలాల్లోని పలు గ్రామాల్లోనూ నిర్బంధం అమలు చేస్తున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రానికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు నిత్యం వచ్చిపోతుంటారు. దీంతో కేసులు ప్రబలకుండా కట్టడి అమలు చేస్తున్నారు. ఇల్లెందు పట్టణానికి భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అనేక మండలాల నుంచి ప్రజలు సరకుల కొనుగోలుకు వస్తుంటారు. దీంతో కేసులు పెరుగుతున్నాయని భావించి మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి.
* మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోనూ పూర్తిస్థాయి నిర్బంధాన్ని అమల్లోకి తెచ్చారు.
*ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పలు గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి.
గ్రామాల్లో స్వీయ నిర్బంధం... పట్టణాల్లో ఆంక్షలు - స్వీయ నిర్బంధంలో గ్రామాలు
కరోనా మహమ్మారిపై పోరుకు పల్లెలు కదులుతున్నాయి. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని భావిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా కట్టడి అమలు చేస్తున్నాయి. వైరస్ రెండో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు గ్రామాలు స్వయం ప్రకటిత లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగుతుండగా, మరికొన్ని చోట్ల గ్రామ అభివృద్ధి కమిటీలు, సంఘాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రజా సంచారం ఎక్కువగా ఉండే వారపు సంతలను స్థానిక సంస్థలు నిలిపివేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజ్ఞాపూర్, దుబ్బాక, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో నిర్వహించే పలు సంతలను రద్దు చేశారు. నిర్బంధం విధించుకున్న గ్రామాల్లో కొన్నిచోట్ల ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు తెరిచేలా, భౌతిక దూరం పాటించి సరకులు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో కట్టడి చేస్తున్నారు. స్థానికులకు కూరగాయలు, ఇతర వస్తువులు అవసరమైతే ఇంటికే పంపించే ఏర్పాట్లు చేపట్టారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాలను అందజేసినట్లు ఇప్పుడూ సంతలు రద్దయిన చోట్ల అధికారులు సరకులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా కొవిడ్ నిబంధనలు: ఎస్ఈసీ