సంపన్న దేశాల్లోనూ వెంటిలేటర్లు లేక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న దయనీయ స్ధితి. ఇలాంటి తరుణంలో మనదేశంలో వైరస్ విజృంభిస్తే తగినన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్ ముందుకొచ్చింది. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లడంతోపాటు బ్యాటరీతో పనిచేసే నమూనా(ప్రొటోటైప్)ను ఐఐటీ-హెచ్ అంకుర సంస్థ ఏరోబయోసిస్ 12 రోజుల్లోనే సిద్ధం చేసింది. దీనికి ‘జీవన్‌లైట్’గా నామకరణం చేసినట్లు ఐఐటీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.
ఇవీ ప్రత్యేకతలు...
- ఈ వెంటిలేటర్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు వాడుకోవచ్చు.
- ఇందులో ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతను వాడారు. దీనివల్ల బాధితుల శ్వాసకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైద్యులు తమ చరవాణిలోని యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు.
- ప్రతిసారీ బాధితుల దగ్గరకు వెళ్లి పరీక్షించాల్సిన అవసరం తప్పుతుంది. అంటే ఇది వైద్యులకూ రక్షణగా నిలుస్తుందని ఆవిష్కకర్తలు చెబుతున్నారు.
- చిన్నగా ఉన్న ఈ వెంటిలేటర్‌తో అన్ని వయసుల వారికీ సేవలు అందించొచ్చు.
- వెంటిలేటర్ చుట్టుపక్కల ఉండే గాలిని శుభ్రపరిచి రోగికి అందిస్తుంది.
- రూ.1 లక్షకే దీనిని అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో ఖర్చును తగ్గించడానికి అవకాశముంది.