వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికి తెలియదన్నది ఓ నానుడి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో కొంతమేర వానని అంచనా వేసినా.. అది అంతంత మాత్రమే. కచ్చితమైన వర్షపాతాన్ని అంచనా వేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రోఫెసర్ కీర్తి సాహూ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సృష్టికే ప్రతిసృష్టిలాంటిది తయారు చేశారు. భూమి నుంచి 6కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశంలో ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించే సిమ్యూలేటర్‌ను రూపొందించారు.
వర్షపాతం వర్షపు బిందువు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా వాన చుక్క పరిమాణం ఉంటుంది. ప్రస్తుతం రాడార్ల ద్వారా ఆకాశంలోకి సంకేతాలు పంపి.. వచ్చిన ఫలితాల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు. డ్రోన్లు, విమానాలు వంటి వాటిని ఆకాశంలోకి పంపి పైన ఉన్న సమచారాన్ని సేకరిస్తున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి చేస్తున్న అంచనాలకు.. వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉంటోంది.
10సంవత్సరాల పాటు శ్రమించిన పరిశోధకులు: భూమికి, మేఘాలకు మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమను పరిగణలోకి తీసుకోకపోవడం దీనికి కారణంగా ఐఐటీ పరిశోధకులు గుర్తించారు. 10సంవత్సరాల పాటు శ్రమించి ఈ సమస్యను అధిగమించే పరిష్కారాన్ని కనుగొన్నారు. భూమి నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు గల పరిస్థితులను కృత్రిమంగా కల్పించేసిమ్యూలేటర్‌ను ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఈ భారీ పరికరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
90శాతం వరకు తేమను సిమ్యూలేటర్‌లో సృష్టించుకునే అవకాశం: వాతావరణంలోని పరిస్థితుల వల్ల వాన బిందువు.. భూమిని చేరే లోపల పరిమాణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి అంచనాల కోసం లేజర్ కట్టింగ్ అనుసంధానించారు. సాధారణంగా పైకి కిలోమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్ది 10డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. -10డిగ్రీల వరకు ఉష్ణోగ్రత, 90శాతం వరకు తేమను సిమ్యూలేటర్‌లో సృష్టించుకునే అవకాశం ఈ పరికరంలో ఉంది. దీనిని పూర్తిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులే రూపొందించారు. స్థానికంగానే తయారీ సైతం పూర్తి చేశారు.
ఇందులో మిషన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్‌లైన్ హలోగ్రఫీ సాంకేతికతను సైతం ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన అంచనాకు ఇది సహకరిస్తుంది. ప్రస్తుతం భారత వాతావారణ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకుని.. సిమ్యూలేటర్లో ఆ పరిస్థితులను కల్పించి.. అంచనాలు రూపొందిస్తున్నారు. భవిష్యత్లో సొంతంగా డ్రోన్ ద్వారా సమాచారాన్ని సేకరించుకునే దిశగా సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.