సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్.. ఒక కొమ్మన పూచిన పూవుల్లాంటి తోడబుట్టిన వాళ్ల రక్తసంబంధం ఔన్నత్యాన్ని తెలిపే పండుగ రాఖీ. రక్తసంబంధం గొప్పతనాన్ని తెలియజేసే పండుగ ఏదైనా ఉందీ అంటే అది ఇదే. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆడపడుచులతో మంత్రి హరీశ్..
ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెల్ల అనుబంధం, ఆప్యాయతకు ప్రతిరూపం రక్షాబంధన్ అని హరీశ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు అతిథిగృహంలో మంత్రి హరీశ్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గందె రాధిక, ఎంపీపీలు కలిశారు. వారికి మంగళహారతులు ఇచ్చి తిలకం దిద్దారు. రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు. హుజూరాబాద్ చెల్లెల్ల మధ్య రాఖీ జరుపుకోవటం సంతోషంగా ఉందని హరీశ్ అన్నారు.
అనంతరం హుజూరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తూ హరీశ్ రావు హుస్నాబాద్‌లో ఆగారు. అక్కన్నపేట జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ.. హరీశ్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సిద్దిపేటకు వెళ్లారు.
వేడుకల్లో పాల్గొన్న తలసాని..
రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. ఆయన సోదరీమణులు రమాదేవి, విజయ రాణి, లక్ష్మీ బాయ్‌లు మంత్రి తలసానికి రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు. అనంతరం తన సోదరీమణుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి: మంత్రి మల్లారెడ్డి
రక్షా బంధన్‌ను పురస్కరించుకొని సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరీమణులు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. అదేవిధంగా బ్రహ్మకుమారీలకు చెందిన సోదరీమణులు, పలువురు తెరాస మహిళా కార్యకర్తలు వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అందరూ రాఖీ పండుగ జరుపుకోలేకపోయారని.. ప్రస్తుతం కేసులు తగ్గిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.