పలకరింపులకు దూరంగా అయిన వారికి భారంగా అంతిమ ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ఉచితసేవలు అందిస్తోంది 'స్పర్శ్ హాస్పిస్'. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం నానక్‌రామ్‌గూడ మార్గంలోని ఖాజాగూడ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. నేడు ఈ భవనాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛŸత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. మనిషి పుట్టుక నుంచి పెరిగేంత వరకూ ఎంత గొప్పగా జీవించాడో.. మరణానికి కూడా అంతే గౌరవాన్ని అందించాలనే సంకల్పంతో సేవలు అందిస్తున్నామని స్పర్శ్ హాస్పిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్‌మోహన్‌రావు ఎర్రపోతు తెలిపారు.
82 పడకలు.. 4 వాహనాలు
కార్పొరేట్ సంస్థలో పనిచేసే రామ్‌మోహన్‌రావు 2011లో రోటరీ బంజారాహిల్స్ శాఖ ప్రారంభించారు. 2017లో స్పర్శ్ హాస్పిస్ సేవలు మొదలుపెట్టారు. ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రితో కలసి 12 పడకలతో మొదలై 3,900 మందికి స్పర్శ్ సాంత్వన ఇచ్చింది. పాలికేర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యసిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఇంటివద్దనే (హోమ్‌కేర్) సేవలు అందిస్తున్నారు. సేవలు మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో సొంత భవనం నిర్మించేందుకు సంస్థ సిద్ధమైంది. 2017లో అనువైన స్థలం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాజాగూడ వద్ద ఎకరా స్థలం కేటాయించారు. మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే భవన నిర్మాణం సాకారమైందని రామ్‌మోహన్‌రావు తెలిపారు. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం 10 కేటాయించారు. డాక్టర్లు ఆంజనేయులు, వనజ, కమలాకర్ , 30 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.