తెలంగాణ

telangana

ETV Bharat / state

'అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు'

రాష్ట్రంలో సంచలనం రేపిన యువ పశు వైద్యురాలి హత్యాచర ఘటనపై దేశంలోని నేతలతో పాటు ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు తెలుపగా... ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు మారుస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

leaders visit shamshabad victim family members
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు

By

Published : Nov 30, 2019, 5:31 PM IST

Updated : Nov 30, 2019, 6:39 PM IST

శంషాబాద్ హత్యోదంతంపై దేశంలోని నేతలతో పాటు ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారించింది. యువతి కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, కాంగ్రెస్​ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, గీతారెడ్డి, సినీనటుడు అలీలు పరామర్శించారు. ఈ కేసులో నిందితులపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం వైద్యురాలి కుటుంబానికి అండగా నిలుస్తుందని వారు హామీ ఇచ్చారు.

శిక్ష పడేలా చూస్తాం: జాతీయ మహిళా కమిషన్​

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామలా కుందర్ బాధిత కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హత్యకాండకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని... నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు

చట్టాలు మారుస్తాం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

శంషాబాద్ యువతి హత్య కేసులో నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలిని పోలీసులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు మారుస్తామన్నారు.

పోలీస్​ యంత్రాంగం వైపల్యమే: లక్ష్మణ్​

పోలీసు యంత్రాంగం వైఫల్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని... హైదరాబాద్ లో మాదకద్రవ్యాల సంస్కృతి పెచ్చుమీరుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. యువతి హత్య ఘటనపై మంత్రులు అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.

కఠిన చట్టాలు తేవాలి: కాంగ్రెస్​ నేతలు

శంషాబాద్ హత్యోదంతం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని... వాటికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మాటల్లోనే కాదు చేతల్లోనూ కనిపించాలని సూచించారు. ఈ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ నేత గీతారెడ్డి ఆరోపించారు. ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలను గీతారెడ్డి ఖండించారు.

బాధాకరం: సినీనటుడు అలీ

హైదరాబాద్ శివార్లలో ఇలాంటి ఘటన జరగడం బాధకరమని దారుణమని సినీ నటుడు అలీ ఆవేదన వ్యక్తంచేసారు. నిందితుల తరఫున న్యాయవాదులెవరూ వాదించవద్దని అలీ అభ్యర్థించారు.

'అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు'

ఇవీ చూడండి: 'ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించారు.. అసలేం జరిగింది!?'

Last Updated : Nov 30, 2019, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details