ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా సరకు రవాణా చేసే వాహనాలు ఖాళీగా తిరిగి వెళ్లకుండా వినూత్న ప్రయోగం చేశాడు రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేటకు చెందిన బాలరాజు. ప్రతినిత్యం వందలాది వాహనాలు సరకుల రవాణాలో తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఒకవైపు మాత్రమే సరకు రవాణా చేస్తూ రెండో వైపు మాత్రం ఖాళీగా వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇంధన వృథాతోపాటు వాహన యజమానులకు నష్టం వాటిల్లుతోంది. ఆయా లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఆధాట్రిప్ యాప్ అటు వాహన యజమానులతోపాటు సరకు రవాణా చేసే వారికీ ఖర్చును తగ్గించుకునేందుకు దోహదం చేస్తోంది.
సరికొత్త యాప్
సరకు రవాణా చేసే వాహనాలు తమ ప్రయాణంలో ఏదో ఒక ట్రిప్పు ఖాళీ వాహనంతో తిరిగి వెళ్లవలసి వస్తుంది. అందువల్ల ఇంధన వినియోగం పెరిగి వాతావరణ కాలుష్యం రెట్టింపుతోపాటు డబ్బు సమయం వృథా అవుతుంది. ఆ విషయాన్ని గమనించిన లింగన్నపేటకు చెందిన యువకుడు బాలరాజు సరికొత్త యాప్‌కు రూపకల్పన చేశాడు. ఈ యాప్ ద్వారా సరకు రవాణాదారులు, వాహనదారులను కలిపే వేదిక ఒకటి రూపొందించానని బాలరాజు చెబుతున్నాడు. ఈ ప్రయోగంతో రాబోయే రోజుల్లో రోడ్లపై ఖాళీ వాహనాలు తిరగకుండా.. సరకు రవాణా రంగాన్ని ఒక ప్రణాళిక పద్ధతిలో వాహన ప్రయాణం సాగుతుందని తెలిపారు.
నమోదు చేసుకుంటే
వాహన యజమానులు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలు నమోదు చేసుకుంటే యాప్‌లో సరకు రవాణాకు సంబంధించిన సమాచారం చౌకగా అందుబాటులోకి రానుంది. సరుకు రవాణా రంగంతో ప్రత్యక్ష & పరోక్ష సంబంధం ఉన్న అందరికీ వారి ఆదాయం అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని బాలరాజు అభిప్రాయపడ్డారు. తనకు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనకు మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఎంతో శ్రమపడి రూపొందించిన యాప్‌ను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని బాలరాజు అన్నారు. వృథాను అరికట్టడాన్ని మించిన ఉత్పత్తి మరొకటి లేదని.. దేశంలోనే ఇలాంటి సేవలను ప్రారంభించిన మొదటి యాప్ ఇదేనని ఆయన అంటున్నారు.
యజమానులు సంతృప్తి
ఇలాంటి యాప్ అమల్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని వాహన యజమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు తగిన ఆదాయం లభించేందుకు అస్కారముందని వాహన యజమానులు చెబుతున్నారు. తమ సరకులు తక్కువ రవాణా ఛార్జీలతో చేరవేసేందుకు అవకాశం ఏర్పడిందని వినియోగదారులు పేర్కొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకుంటే .. ఏ తేదీన ఎక్కడి నుంచి సరకు రవాణాకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఫోన్‌కు సమాచారం వస్తుందని బాలరాజు ధీమా వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి :నేతన్నల నేస్తం ఈ ఖమ్మం కుర్రాడు..