YS Sharmila Fires On State Government: రాష్ట్రంలో తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అందులో భాగంగానే నిన్న పాదయాత్రకు చెందిన ఫ్లెక్సీలు చించివేశారని విమర్శించారు. ఆ క్రమంలోనే తమ పార్టీకి చెందిన నాయకులపై దాడి చేశారని తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఇంత జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కటికనపల్లిలో పాదయాత్రలో భాగంగానే నైట్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు కానీ అక్కడ నైట్ క్యాంపుకు సంబంధించిన టెంట్లను అధికారులు తొలగించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీసులు తెరాస నాయకులకు లోబడే పని చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
"ప్రజలలో మాకు ఆదరణ లేదని మీరు అనుకున్నప్పుడు మాపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మాకు వస్తున్న ఆదరణను మీరు తట్టుకోలేకనే ఈ దాడులు. మాది పార్టీ కాదని మీరు తీసివేశారు. దాడులు ఎందుకు చేస్తున్నారు. ఎక్కడికి పోయినా మేము స్థానికంగా జరుగుతున్న అవినీతి గురించి, ఎమ్మెల్యే గురించి మాట్లాడాం. వారు దానికి సమాధానం చెప్పకపోగా అందరూ కలిసి నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు." -వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు