kishan Reddy Comments On Telangana Development: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్యానికి నిధులు ఇస్తుంది కేంద్ర సర్కారు అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా కేంద్రమే డబ్బులు ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.
అభివృద్ధిలో రాజకీయం చేయబోం: ఈ 8 ఏళ్లల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఇంటికీ కేంద్రం ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని.. తాము అభివృద్ధిలో రాజకీయం చేయబోమని అన్నారు. యూరియా మీద కేంద్రం భారీగా రాయితీ ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.
కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ధరను మోదీ ప్రభుత్వం రూ.2 వేలకు పైగా పెంచిందని గుర్తు చేశారు. రూ.26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుకూలమా.. కాదా అని రైతులు ఆలోచన చేయాలని కోరారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా అన్నదాతల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.