తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల కార్మిక విముక్తి కోసం... పీపుల్‌ హెల్ప్‌ చిల్డ్రన్‌..! - పీపుల్ హెల్ప్‌ చిల్ట్రన్

సరదాలు.. షాపింగ్‌.. సినిమా... యువత అంటే ఇంతేనా? కాదు.. అంతకుమించి అని నిరూపిస్తున్నారు ఇద్దరు యువకులు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. సేవకులుగా మారి బాలకార్మికుల విముక్తి కోసం కృషి చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

people help children founder santhosh kumar
పీపుల్‌ హెల్ప్‌ చిల్డ్రన్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్‌.

By

Published : May 1, 2021, 7:26 AM IST

ఆర్థిక అగచాట్లు బాల కార్మికుడిగా మార్చితే... ఆపన్నహస్తం అండతో ఉన్నత విద్యావంతుడయ్యాడు. ఆదుకున్న సమాజానికి తిరిగి ఇవ్వాలని చిన్నారి శ్రామికులను విముక్తులను చేస్తున్నాడు. అవసరాల్లో ఉన్న పిల్లల్నీ ఆదుకుంటున్నాడు. ఆ యువకుడే పీపుల్‌ హెల్ప్‌ చిల్డ్రన్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్‌.

సంతోష్‌కుమార్‌ది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని. నిరుపేద కుటుంబం. బడి మధ్యలోనే మానేసి కూలీగా మారాడు. ఓ స్క్రాప్‌ దుకాణంలో పని చేస్తుండగా ప్రభుత్వ అధికారులు గమనించారు. ఆ పని మాన్పించి చదువుకునేందుకు సాయం చేశారు. సోషల్‌వర్క్‌లో పీజీ పూర్తి చేసి కొన్నేళ్లు పట్నా, దిల్లీ, హైదరాబాద్‌లలో ఉద్యోగం చేశాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డా సంతోష్‌ మనసంతా సమాజ సేవ మీదే. 2018లో పీపుల్‌ హెల్ప్‌ చిల్డ్రన్‌ (పీహెచ్‌సీ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడు. పాత మిత్రుల సాయం కోరాడు. ఆరుగురు నెలనెలా కొంత మొత్తం ఇవ్వడమే కాదు.. యాక్టివ్‌ మెంబర్స్‌గా ఉండేందుకు అంగీకరించారు. తర్వాత సేవా దృక్పథం ఉన్న వాళ్లందరినీ కలుపుకోసాగాడు. రెండేళ్లలో 526 మంది జతయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. దాతలు, సభ్యుల సహకారంతో పోగైన మొత్తాన్ని తొమ్మిది రాష్ట్రాల్లోని అనాథాశ్రమాల్లో పిల్లల బాగోగుల కోసం వెచ్చిస్తున్నాడు.

ఇవీ సేవలు
క్యాన్సర్‌, ప్రమాద బాధితులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు లక్షల్లో విరాళాలు సేకరించి ఆదుకున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలు, అనాథాశ్రమాల్లోని బాలికలు, విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మంది చిన్నారులను ఆదుకున్నారు. సంతోష్‌ బాల కార్మికుల వెతలు తీర్చడానికి శ్రమిస్తున్నాడు. పీహెచ్‌సీ బృందంలోని పదిమంది సభ్యులు తొమ్మిదిరోజులు 33 జిల్లాల్లో నిరంతరాయంగా రెండున్నర వేల కిలోమీటర్లు ప్రయాణించారు. బస్టాండులు, రైల్వేస్టేషన్లు, పరిశ్రమలు, దుకాణాల్లో కలియతిరిగారు. 56మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి అధికారుల సాయంతో స్కూళ్లలో చేర్పించారు. వాట్సాప్‌ గ్రూపులతో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్నారు.
గుర్తింపు
*చిల్డ్రన్‌ హెల్పింగ్‌ విభాగంలో 2018 రాష్ట్రప్రభుత్వ పురస్కారం
*స్త్రీ, శిశు సంక్షేమశాఖ ‘గ్రేట్‌ వలంటీరింగ్‌ సర్వీస్‌’ అవార్డు
*డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (ఐసీపీఎస్‌) డబ్ల్యూసీడీ.. ‘బెస్ట్‌ సర్వీస్‌’ అవార్డు
*తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖ నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే వేడుకల్లో ఔట్‌స్టాండింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ అవార్డు.

రక్త దాతగా..

గతేడాది లాక్‌డౌన్‌లో తలసేమియాతోపాటు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు రక్తం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో హైదరాబాదీ మహేశ్‌ తలారి ముందుకొచ్చాడు. 8 నెలల కాలంలో పది వేల యూనిట్ల రక్తం సేకరించి రోగులకు ఆపద్బాంధవుడయ్యాడు. ఆ సేవా స్ఫూర్తి కొనసాగుతూనే ఉంది.

మహేశ్‌ తల్లిదండ్రులిద్దరూ ప్రజాసేవలో ఉండటంతో తనకూ ఆసక్తి ఉండేది. కాలేజీ రోజుల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఎమ్మెస్సీ అయ్యాక కొన్నాళ్లు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశాడు. అందులో ఇమడలేక సొంత సంస్థ ఏర్పాటు చేసుకొని మరోవైపు వలంటీర్‌గానూ సేవలందిస్తున్నాడు.

అంతకుముందు వివిధ రక్తదాన శిబిరాల్లో పాల్గొన్న పరిచయాలతో లాక్‌డౌన్‌ సమయంలో పలు ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు మహేశ్‌ను సంప్రదించాయి. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌లను కలిసి విన్నవించాడు. రోగుల ఇబ్బందులు వివరించాడు. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్‌, చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు, స్థానికుల భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. పోలీసులు, మీడియా, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో భారీ స్పందన లభించింది. పోలీసులు, పౌరుల భాగస్వామ్యంతో 7 వేల యూనిట్లు.. అపార్ట్‌మెంట్లు, యువజన సంఘాల ద్వారా మరో 3 వేల యూనిట్లు సేకరించి గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్‌ వంటి ఆసుపత్రులకు అందించాడు. మహేశ్‌ నాలుగేళ్లలో 12 సార్లు రక్తదానం చేశాడు. గతంలో కేరళ, హైదరాబాద్‌ వరదల్లోనూ మిత్రుల సాయంతో పేదలకు ఆహారం అందించాడు.

ఇదీ చూడండి:మంత్రి ఈటల భవిష్యత్తుపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు!

ABOUT THE AUTHOR

...view details