పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ సింగరేణి విస్తరణలో తమ ఉనికి కోల్పోతూ గత ఆరు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సింగరేణి ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-2లో లద్నాపూర్ గ్రామస్తులు సుమారు 120 మంది గురువారం ఆందోళన చేసి క్వారీ పనులను అడ్డుకున్నారు.
గ్రామస్తులందరూ కలిసి ఓసీపీ-2 వద్ద ధర్నా నిర్వహించి, సింగరేణికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం క్వారీలోకి దిగేందుకు ప్రయత్నించగా, సింగరేణి అధికారులు కవ్వింపు చర్యలతో గ్రామస్థులు ఉన్న ప్రదేశంలోనే బ్లాస్టింగ్ చేపట్టారు. దీంతో ఇరువర్గాల వారు వాగ్వాదానికి దిగారు. గ్రామ సమీపంలో క్వారీలో బ్లాస్టింగ్ల వల్ల గృహాలు ధ్వంసమవుతున్నాయన్నారు. తమ గ్రామానికి చెందిన యువకులు సింగరేణిలో అంతర్భాగమైన ఎన్సీసీ కంపెనీలో పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించారన్నారు.