రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమే అయినా భగవంతునిపై భారం వేసి ఉన్నదాంట్లో బతుకీడుస్తున్న కుటుంబం ఒకరిదైతే.. అందులో కొందరు దివ్యాంగుల బాధ్యతలను భుజాల మీద వేసుకున్న మానవతావాది మరొకరు.. పుట్టుకతో మూగ, చెవుడు లోపంతో ఉన్న వారికి క్రమేణా కంటిచూపు సైతం దూరమైంది.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగరంలోని బాపూజీనగర్, మార్కండేయ కాలనీలో నివసించే ఈ కుటుంబాల దీనగాథ ఇది..
చూపు లేకపోయినా మేకలకు నీళ్లు పెడుతున్న అబ్దుల్లా
పదిమందిలో ఐదుగురికి..
గోదావరిఖనిలోని నగరపాలక కూరగాయల మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి అమ్ముకుంటూ జీవనం సాగించే మహ్మద్ అస్లాంకు పది మంది సంతానం.. అందులో ఐదుగురు దివ్యాంగులు.. అందరికీ ఒకేరకమైన వైకల్యం ఉంది. పుట్టినప్పటి నుంచి చెవులు వినిపించకపోవడంతో పాటు మాటలు వచ్చేవికావు. చూపుమాత్రం ఉండడంతో సైగలతోనైనా వారి పనులు వారు చేసుకోవడంతో పాటు ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహకరిస్తుండేవారు. వయసు పెరుగుతున్న కొద్ది క్రమంగా అందరికీ చూపు మందగించి అంధత్వం ఏర్పడింది.. నరాల వ్యాధి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇది జన్యులోపంతో సంక్రమిస్తుందని వైద్యులు చెప్పారు. మహ్మద్ అస్లాం, జయిబున్నీషాబేగం దంపతులకు 10 మంది సంతానం కాగా, అందులో మహ్మద్ అజ్మీర్(38), హాజీరా(35), సాబీరా(33), అబ్దుల్లా(28), రహమతున్నీషా(22) దివ్యాంగులు. మిగతా అయిదుగురిలో ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయగా, మరో ఇద్దరు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు తల్లిదండ్రులతో ఉంటూ దివ్యాంగులైన సహోదరులకు సేవలందిస్తున్నారు.
అస్లాం చిరు వ్యాపారం అంతగా సాగకపోయినా ఆత్మగౌరవంతో ఉన్నదాంట్లో సర్దుకుంటూ కుటుంబాన్ని సాగదీస్తున్నారు. ప్రభుత్వం అందించే వికలాంగుల పింఛనే జీవనాధారం.. దివ్యాంగులైనా ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక అబ్దుల్లా చిన్న మేకపిల్లను తెచ్చుకొని పెంచడం మొదలుపెట్టగా ఇప్పుడు ఐదారు మేకలయ్యాయి. ఇంట్లో గుర్తుల ఆధారంగా, గోడలు పట్టుకుంటూ మేకల వద్దకు వెళ్లి స్వయంగా వాటికి మేత, ఆహారం పెడుతుండగా తల్లి, సోదరులు ఆయనకు సహకరిస్తుంటారు. చూపు లేకపోయినా చిన్నతనంలో చదువుకున్న జ్ఞానాన్ని మరిచిపోని అజ్మీర్ తనకు తోచిన పదాలను గుండ్రంగా తెల్లకాగితంపై రాస్తూ ఉంటాడు.