Telangana University VC Controversy News :తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు చెప్పగానే ఘనతలకు బదులు గొడవలే గుర్తొస్తాయి. వివాదాలకు నిలయంగా తెలంగాణ యూనివర్శిటీ మారిపోయింది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఉపకులపతి రవీందర్ గుప్తా వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తనకు నచ్చినట్టుగా వర్సిటీలో పాలన సాగిస్తూ.. తనకు అనుకూల రిజిష్ట్రార్‌లను పెట్టుకుని అక్రమ నియామకాలు, ఇష్టారాజ్యంగా వర్శిటీ డబ్బులు ఖర్చు చేస్తూ వివాదాల్లో నిలిచారు. దీంతో పాలక మండలి సభ్యులు వీసీ తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గతంలో రిజిష్ట్రార్‌లను మార్చి చూసినా ప్రయోజనం కనిపించ లేదు.దీంతో ఈ సారి వరుస సమావేశాలు నిర్వహించి వీసీని ఇరుకున పెట్టాలని భావించారు. కానీ రవీందర్ గుప్తా హైకోర్టును ఆశ్రయించడం, పాలక మండలి సమావేశాల్లో చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈసీకి తలెత్తింది.
Telangana University EC vs VC : తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, గతంలో ఇది వరకు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. సమావేశానికి వీసీ మరోసారి హాజరుకాలేదు. ఆయన అక్రమాలు చేశారని, దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రవీందర్ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి 28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఈ అంశాలపై ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాలతో విచారణ చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా వర్శిటీలో విజిలెన్స్ విభాగం తనిఖీలు చెయ్యడం ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా ప్రచారం సాగుతోంది.
Vigilance raids in Telangana University Controversy : విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాస్ నేతృత్యంలో 10 మంది సభ్యుల బృందం తనిఖీలు చేసారు. పరిపాలనా భవనం, వీసీ నివాసం, ఇతర విభాగాల్లో సోదాలు చేశారు. వర్శిటీ అనుబంధ బ్యాంకులో వివరాలు సేకరించారు. వర్సిటీలోని పరీక్షల విభాగంలోనే ఎక్కువగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇక ఈ దాడులతో వీసీ తనకు తానుగా రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వీసీని రికాల్ చేయాలంటే అసాధ్యం అని భావిస్తున్న ప్రభుత్వం... రాజీనామా చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విజిలెన్స్ దాడులతో రవీందర్ కూడా వెనక్కి తగ్గారనే ప్రచారం సాగుతోంది. ఈ ఘటనలతో ఆయన రాజీనామా చేస్తారా లేదంటే మరోసారి తనదైన రీతిలో సమాధానం చెప్తారా లేదా వెనక్కి తగ్గుతారా అన్నది తేలాల్సి ఉంది. సోదాల తర్వాత ఉకులపతి విశ్వవిద్యాలయం వైపు రాలేదు. ఈ పరిమాణాల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.