తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుకాసురుల చేతుల్లో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

వేల ఎకరాలకు నీరందించే శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు ఇసుకాసురుల చేతుల్లో బక్కచిక్కి పోతోంది. ఎగువన నీరు లేకపోవడం వల్ల ప్రాజెక్టు లోపలి భాగంలో ఇసుక మేట వేసింది. దీన్నే అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే కొనసాగితే ఉత్తర తెలంగాణ వర ప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నట్లే...

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు

By

Published : Aug 1, 2019, 9:43 AM IST

ఇసుకాసురుల చేతుల్లో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

ఉత్తర తెలంగాణ వర ప్రదాయనిగా భావిస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. నీళ్లు లేకపోవడం వల్ల ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల ప్రాజెక్టు బలహీన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ తవ్వకాలు

నిజామాబాద్​ జిల్లాలోని 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుపై ఇసుకాసురుల కన్నుపడింది. ఎగువ భాగంలో వర్షాలు లేక ఇసుక మేట వేసింది. ఇదే అదునుగా కొందరు ప్రాజెక్టు లోపలి భాగంలో ఇసుక తవ్వకాలను తెరతీశారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సొమ్ముచేసుకుంటున్నారు.

నిపుణుల ఆందోళన

డ్యాం నిర్మాణ సమయంలో తొలుత మట్టి కట్టను నిర్మించి దానిపై ఇసుక, మెటల్​తో చదును చేశారు. అనంతరం రివిట్​మెంట్​ చేసి కట్టను పటిష్ఠం చేశారు. ఇప్పుడు ఇసుక కోసం కట్టకు సమీపంలో తవ్వకాలు చేపట్టడం వల్ల కట్ట బలహీన పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాంపై భాగంలో గైడ్​ వాల్​, బయటి వైపు రహదారి నిర్మాణం కోసం పది రోజుల కిందట పనులు ప్రారంభించారు. ఇందుకోసం సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుక కేటాయించారు. వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను, ప్రాజెక్టులోని ఇసుకను కట్టపై కుప్పలుగా పోశారు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.

మంత్రి స్పందన

ప్రాజెక్టు లోపల రహదారి నిర్మాణం చేసి రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. వేల ఎకరాలను నీరందించే ప్రాజెక్టు భవితవ్యాన్ని అక్రమార్కులు ప్రశార్ధకం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు మంత్రి ప్రశాంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

ఇదీ చూడండి : హెచ్‌ఎండీఏకు తొలగించే అధికారం ఉందా.. లేదా..?

ABOUT THE AUTHOR

...view details