నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి (Armor Government Hospital) కొన్నేళ్లుగా ప్రసవాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక ప్రసవాలు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా నిలిచింది. నిత్యం గర్భిణీలు, బాలింతలతో ఆస్పత్రి కిటకిటలాడుతూ కనిపిస్తోంది. 2019లో 2,460, 2020లో 2,092, 2021లో ఇప్పటి వరకు 1,196 ప్రసవాలు చేశారు. ఈ ఏడాది జనవరిలో 105, మే నెలలో 83, జూన్‌లో 117, ఆగస్టులో 113, సెప్టెంబర్‌లో 209 ప్రసవాలు చేశారు. కేసీఆర్ కిట్ వచ్చినప్పటి నుంచి ఆర్మూర్ ఆస్పత్రిలో ప్రతి నెలా 200కు పైగా ప్రసవాలు జరిగేవి.
కాస్త తగ్గినా...
ప్రసవాల్లో రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రి(Armor Government Hospital)లో కొన్ని నెలలుగా ఇబ్బందులు తలెత్తడంతో వెనుకబడింది. కొవిడ్ విపత్కర పరిస్థితి, శాశ్వత మత్తు వైద్యుడు లేక కొన్ని నెలలుగా ప్రసవాలు తక్కువగా నమోదయ్యాయి. కలెక్టర్ నారాయణరెడ్డి (Collector Naraya Reddy) చొరవ చూపడంతో ఏడాది తర్వాత మళ్లీ ఒక నెలలోనే 200కు పైగా కాన్సులు జరిగాయి. గతేడాది కొన్ని నెలలు, ఈసారి మార్చి నుంచి జూన్ వరకు సంఖ్య తగ్గింది. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా వంద పడకలు ఏర్పాటు చేయడంతో ప్రసూతి వార్డును సిమాంక్ కేంద్రానికి మార్చారు. అక్కడ 25 పడకలు వేసినా అవి సరిపోక ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం గైనిక్ వార్డును నూతన భవనంలోకి మార్చడంతో ఆ ఇబ్బంది తొలగి గత ప్రసవాల సంఖ్యను ఆర్మూర్ ఆస్పత్రి అందుకుంది.
మత్తు వైద్యుడు లేకపోవడం...
ఆర్మూర్ ఆసుపత్రికి శాశ్వత మత్తు వైద్యుడు లేకపోవడం గతేడాది పెద్ద సమస్యగా మారింది. ఒక్కో కేసుకు రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చి ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగించుకున్నారు. జులై నుంచి ఆ విధానాన్ని వైద్యశాఖ రద్దు చేసింది. ఇది వరకు సేవలందించిన వారికి డబ్బులివ్వలేదు. వారు రావడం మానేయడంతో కొన్ని రోజులు కాన్పులు నిలిచిపోయాయి. సూపరింటెండెంట్ నాగరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా ఉప వైద్యాధికారి రమేశ్‌కు మత్తు వైద్యుడిగా సేవలందించాలని సూచించడంతో సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు మళ్లీ ప్రైవేటు నుంచి రోగులు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుండటంతో పూర్వ వైభవం కనిపిస్తోంది. ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తుండటంతో సంతోషంగా ఉందని రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత తీరిస్తే మరిన్ని సేవలు...
ఆర్మూర్ ఆసుపత్రి(Armor Government Hospital)ని వైద్యవిధాన పరిషత్ అధీనంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇద్దరు మత్తు వైద్యులను కేటాయిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వైద్య నిపుణులు, అదనపు సిబ్బంది వస్తే ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని... ఇద్దరు మత్తు వైద్యులు కావాలని నివేదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. ఉన్న వసతులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పేద రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఉత్తమ ఆస్పత్రిగా నిలుస్తున్న ఆర్మూర్ దవాఖానాకు ప్రభుత్వం మరిన్ని సదుపాయలు కల్పించడంతో పాటు వైద్యులు, సిబ్బంది కొరత తీరిస్తే మరింత మంది పేదలకు సేవలందే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:Petrol Diesel Hike: పండుగ వేళ సామాన్యుడిపై ధరల పోటు